Telangana | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పదేండ్లు ప్రజలను ప్రతీ అంశంపై రెచ్చగొట్టి, వారి మెదళ్లలో విషబీజాలునాటి కేసీఆర్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసినందుకు ఇవ్వాల తగిన మూల్యం చెల్లించుకోకతప్పని వాతావరణం నెలకొన్నది. నాడు కేసీఆర్ సర్కార్ చేపట్టిన ప్రతీ పనిని తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీపడ్డాయి. భూసేకరణ చట్టాల్లో పేర్కొన్న సూచనల కన్నా ప్రజామోద ప్యాకేజీలను ప్రకటించి వారి సమ్మతితో ప్రాజెక్టులను నిర్మించిన ఉదంతాలకు, ప్రస్తుతం రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరికి మధ్య ఉన్న తేడా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రాజెక్టు నిర్మాణ ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నా.. ప్రాజెక్టేతర ప్రాంతాల్లో సదరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నాడు కాంగ్రెస్, బీజేపీలు పెద్ద వివాదాలే సృషించిన దాఖలాలు అనేకం. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని రాష్ట్రమంతా ప్రచారం చేశారు. మరోవైపు ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదిత గ్రామాల ప్రజలను రెచ్చగొట్టేందుకు చేయని పనిలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఆయా వేదికల మీద ఫిర్యాదు చేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవటం కోసం కాంగ్రెస్ ఏకంగా మరణించిన వ్యక్తుల పేర్ల మీద కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయి. వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరించారు.
వికారాబాద్ ప్రజాగ్రహానికి కాంగ్రెస్, బీజేపీల బాధ్యతారాహిత్యమే కారణమని అంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ రెండు పార్టీలు పోటీపడి ఉసిగొలిపినందుకే ఇవ్వాల తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి బాధ్యరాహిత్యాన్నే అధికారంలో ఉన్నప్పుడూ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నదని ఉదహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం వల్లే బూరోక్రాట్ల మీద దాడి దాకా తీసుకొచ్చిందని, ఇప్పటికైనా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరంఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.