హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని ‘లగచర్ల’ రైతులు తమ భూములను కాపాడుకునేందుకు చేసిన పోరాటం వృథా అయింది. ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకుంటున్నట్టు చెప్పి మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ (Multipurpose Industrial Par) ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి శుక్రవారం నోట్‌ను విడుదల చేసింది. తాజాగా దుద్యాల మండలంలో మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికోసం మండలంలోని లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
కాగా, ఫార్మా విలేజ్ కోసం గతంలో లగచర్లలో 632.25 ఎకరాలు, పోలేపల్లిలో 72 ఎకరాలు కలిపి మొత్తం 704.25 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే భూసేకరణను రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫార్మా విలేజ్ ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది.
లగచర్లలో రైతులు భూసేకరణను అడ్డుకున్నది, అధికారులపై కొందరు దాడి చేసింది తమ భూములు పోతున్నాయన్న ఆవేదనతోనే అన్నది అక్షర సత్యం. ఈ క్రమంలో ప్రభుత్వం దీనికి రాజకీయ రంగు పులిమేందుకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అనుచరుల పేర్లను తెరమీదికి తెచ్చి, ఆయనను అరెస్ట్ చేసింది. ఏ తప్పూ చేయకపోయినా ఆయనను జైలులోనే కొనసాగిస్తున్నది. మరోవైపు అర్ధరాత్రి పోలీసులు లగచర్ల గ్రామంపై దాడి చేసి, ఇండ్లల్లోకి బలవంతంగా దూరి రైతులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రైతుల భార్యలు, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ వరకు వచ్చి తమ నిరసనను తెలియజేశారు. ఢిల్లీ వరకు వెళ్లి మానవ హక్కుల సంఘాలను, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు వ్యవసాయం తప్ప మరేమీ తెలియదని, తమ పొలాలను ప్రభుత్వం గుంజుకోవద్దని ప్రాధేయపడ్డారు. చావడానికైనా సిద్ధమే తప్ప భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. రైతుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఈ పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చింది. ఫార్మా విలేజ్ల నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్నది. దీంతో రైతులు సంబురపడేలోగా ‘మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్’ను తెరమీదికి తెచ్చింది. దీంతో తాము ఇన్నాళ్లుగా చేసిన పోరాటం వృథానేనా? అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా విలేజ ఏర్పాటు ప్రతిపాదన నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఫార్మా కంపెనీల కోసం తలపెట్టిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్నది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూమిని సేకరించేందుకు గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా రైతుల పోరాటం నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.