హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): విజయవాడలో వెలుగు చూసిన ఉగ్రలింకు కేసులో తెలంగాణకు చెందిన మహిళ సయిదా బేగంను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని చంచల్గూడకు చెందిన సయిదా బేగంను అరెస్టు చేసి, విజయవాడకు తీసుకెళ్లి విచారిస్తున్నారు. సయిదా బేగం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఉగ్రవాదం వైపు యువత మళ్లేలా ప్రేరేపిస్తున్నట్టు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇటీవల అరెస్టయిన విజయవాడకు చెందిన ముగ్గురు యువకులను ఆ దిశగా మళ్లించడంలో ఆమె కీలకపాత్ర పోషించినట్టు నిర్ధారణకు వచ్చారు. విచారణ అనంతరం సయిదా బేగంను కోర్టులో హాజరుపరిచే అవకాశమున్నది. 12 మంది సభ్యులు ‘అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్’ పేరిట సంస్థను ఏర్పాటు చేసుకొని.. యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు. వారి మూలాలు ఏపీ, తెలంగాణ సహా.. వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, కర్నాటక, బిహార్, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉన్నట్టు గుర్తించారు. దీంతో అక్కడ కూడా ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సోదాలు చేస్తున్నారు.