హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ డెయిరీలకు దీటుగా విజయ డెయిరీని అభివృద్ధి చేసేందుకు డెయిరీ, పశుసంవర్ధక, టీఎస్ఎల్డీఏ అధికారులు సంయుక్తంగా కార్యాచరణను రూపొందించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో విజయ డెయిరీ ఇంటిగ్రేటెడ్ డెయిరీ డెవలప్మెంట్ ప్లాన్‌పై నిర్వహించిన ఒక రోజు వర్షాప్ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..విజయ డెయిరీకి పాలు పొసే రైతులకు ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందించటమే కాకుండా, సబ్సిడీపై పాడి గేదెల పంపిణీ, గడ్డి సరఫరా చేస్తున్నదని వివరించారు. నూతన డెయిరీ అందుబాటులోకి వచ్చేనాటికి పాల సేకరణ 8 లక్షల లీటర్లకు పెరిగేలా కృషి చేయాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయ డెయిరీ ఔట్లెట్లను ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో గుర్తించిన 12 ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటుచేసి అకడి నుండి ఔట్లెట్లకు సరఫరాచేసేలా ప్రణాళికలు రూపొందించి, రాబోయే 6 నెలల్లో అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ వర్షాప్లో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.