హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ కుంభకోణం జగన్‌కు తెలిసి జరిగి ఉండదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం, మీడియాలో వార్తలు వస్తున్నట్టుగా స్కామ్ జరిగిందని తాను నమ్మడం లేదని చెప్పారు. ఏపీ లిక్కర్ పాలసీకి సంబంధించి కేసు నమోదు చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం హైదరాబాద్‌లోని జోనల్ కార్యాలయంలో విజయసాయిరెడ్డిని సుమారు 8 గంటలపాటు ప్రశ్నించింది. విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మిథున్‌రెడ్డి కోరిక మేరకే కసిరెడ్డితో మీటింగ్‌లో పాల్గొన్నానని, మిథున్‌రెడ్డి కోరితేనే అరబిందో నుంచి డబ్బులు ఇప్పించానని విజయసాయి తెలిపారు. శ్రీధర్, కేసీరెడ్డి, మిథున్‌రెడ్డి మధ్య లావాదేవీలు జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే, జగన్‌కు తెలియకుండానే చాలా తప్పులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
లికర్ సామ్ గురించి తనకు తెలియదని, అలాగే జగన్‌కు తెలిసి లికర్స్ సాం జరిగి ఉండదని పేర్కొన్నారు. ఈ కేసుపై అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టు విజయసాయిరెడ్డి వెల్లడించారు. నంబర్ 2 స్థానంలో ఉండి ఈ స్కామ్ గురించి తెలియదా? అని ఈడీ అధికారులు అడిగారని, అయితే తనకు పార్టీలో మాత్రమే నంబర్ 2 స్థానం ఉన్నదని చెప్పానని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దుష్ట ప్రభుత్వమని, తనకు సంబంధం లేని కేసుల్లో తనను ఇరికించిందని విమర్శించారు. అకారణంగా తాను కోట్లు దోచుకున్నానంటూ కూటమి దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు, అయితే, తాను రాజకీయాలను విరమించుకోలేదని చెప్పారు. తాను బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. బీజేపీ నుంచి ఆహ్వానం అందితే ఆలోచిస్తానని చెప్పారు. తన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు అప్రూవర్‌గా మారనని స్పష్టంచేశారు. కూటమిని విడగొడితేనే జగన్ అధికారంలోకి వస్తారని చెప్పారు.