జయశంకర్ భూపాలపల్లి, మే 16 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కాలరీస్ కంపెనీలో ప్రైవేట్ సెక్యూరిటీగార్డుల నియామకాల దందాపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. ‘కొలువుల దందాలో కోటికి స్కెచ్’ అనే శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో గురువారం కథనం ప్రచురితం కాగా భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి విచారణ జరిపారు.
భూపాలపల్లి ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఎంతమంది పని చేస్తున్నారు, భూనిర్వాసితులు, నాన్‌లోకల్ వాళ్లు, అర్హులు, అనర్హులు ఎంత మంది ఉన్నారనే విషయమై ఆరా తీసినట్టు తెలిసింది. సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల కోసం 30 మంది నుంచి రూ.3లక్షల చొప్పున వసూలు చేసి కోటికి స్కెచ్ వేసింది, ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చింది, దందాలో కీలకపాత్ర పోషిస్తున్నది ఎవరు? అనే కోణంలో విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.
భూపాలపల్లి ఏరియాలో పని చేస్తున్న ముగ్గురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, డబ్బులు ఇచ్చిన ఇద్దరు నిరుద్యోగులతో మాట్లాడినట్టు తెలిసింది. ప్రైవేట్ సెక్యూరిటీ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఈ దందాలో కీలక పాత్ర పోషించినట్టు విచారణలో గుర్తించినట్టు సమాచారం. మంత్రులు, ఎంపీలు, సింగరేణి ఉన్నతాధికారులు, ఉన్నతస్థాయి కార్మిక నేతల పైరవీలపైనా కూపీ లాగినట్టు స్థానికంగా ప్రచారం. ఇటీవల డబ్బులు ఇచ్చిన ఒక నిరుద్యోగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి డబ్బులను తిరిగి వసూలు చేసుకున్నట్టు తెలిసింది.