హైదరాబాద్, జూలై 10(నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గల కారణాలపై విశ్లేషించేందుకు వస్తున్న కురియన్ కమిటీ తొలుత వ్యూహకర్త సునీల్ కనుగోలును ప్రశ్నించాలని ఆ పార్టీ సీనియర్ నేత వీ హన్మంతరావు డిమాండ్ చేశారు. తనకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే గెలిచేవాడినని చెప్పారు.
బుధవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. అందరూ కనుగోలు అని పిలిచినా తాను మాత్రం ‘కొనుగోలు’ అంటానని స్పష్టంచేశారు. ఎనిమిదేండ్లుగా ఎలాంటి పదవీ దక్కలేదని, రాజ్యసభ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రీడలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు. టీ 20 వరల్డ్‌కప్ గెలిచిన క్రికెట్ టీంలో సభ్యుడైన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌ను సన్మానించి, ఆయనకు ఇంటిస్థలం, ఉద్యోగం ఇవ్వడంపై సీఎంను అభినందించారు.
నేడు గాంధీభవన్‌కు కురియన్ కమిటీ
లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ గురువారం నుంచి తన పనిని మొదలుపెట్టనుంది. ఇందులో భాగంగానే బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న కమిటీ సభ్యులు కురియన్, రహీబుల్ హుస్సేన్, పర్గత్‌సింగ్ గురువారం ఉదయం 10 గంటలకు గాంధీభవన్‌కు రానున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలను ప్రశ్నించే అవకాశం ఉంది. ఎన్నికల్లో వైఫల్యాలకు గల కారణాలపై విశ్లేషించనుంది.