Ration Cards | హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): ఒక వ్యక్తి తన పిల్లల పేర్లను రేషన్‌కార్డుల్లో జత చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పిల్లల పేర్లు తన గ్రామంలో కాకుండా తన అత్తగారి గ్రామంలో, అత్తగారి రేషన్‌కార్డులో నమోదయ్యాయి! మరో ఉదాహరణలో భార్యాభర్తలు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేయగా, భర్తకు తన సొంత గ్రామంలో, భార్యకు అమ్మగారి ఊర్లో రేషన్‌కార్డు వచ్చింది. మరో వ్యక్తి తన ఇద్దరి పిల్లల పేర్లను జత చేయడానికి దరఖాస్తు చేయగా ఒక్కరి పేరే నమోదైంది.
ఈ విధంగా కొత్త రేషన్‌కార్డుల జారీలో చిత్రవిచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఒకచోట దరఖాస్తు చేస్తే మరోచోట పేర్లు ప్రత్యక్షమవుతున్నాయి. అత్తగారింట్లో దరఖాస్తు చేస్తే అవ్వగారింట్లో వస్తున్నాయి. పిల్లల పేర్లు ఒకచోట, తల్లిదండ్రుల పేర్లు మరోచోట, భర్త పేరు ఒకచోట, భార్య పేరు మరోచోట దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల అర్హులైనవారి పేర్లు కూడా గల్లంతవుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త రేషన్‌కార్డులను జారీచేయడంతోపాటు కుటుంబసభ్యుల పేర్లు జత చేయడం, తొలగింపు కోసం ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇందుకోసం గ్రామసభలతోపాటు మీ-సేవ కేంద్రాల్ల్లోనూ దరఖాస్తులు తీసుకున్నది.
కొత్త కార్డులు, పేర్ల నమోదు ప్రక్రియలో సివిల్‌సైప్లె అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. దరఖాస్తుల పరిశీలన సమయంలో ఒక ప్లాన్ లేకుండా ఇష్టారీతిన అన్నింటినీ కలిపేశారని తెలిసింది. కంప్యూటర్ ఆపరేటర్లకు మొత్తం దరఖాస్తులను అప్పగించడంతో ఈ గందరగోళం జరిగినట్టు సమాచారం. దరఖాస్తులను కంప్యూటర్లో నమోదు చేసే క్రమంలో ఇంటి పేర్లను, ఆధార్‌కార్డులను జత చేయడంతో ఈ తప్పులు జరిగినట్టు తెలిసింది. ఆధార్ కార్డుల్లో వారి ఇంటి పేర్లు ఉండటంతో అత్తగారింటికి బదులుగా అమ్మగారి ఊర్లో పేర్లు జతైనట్టు సమాచారం.
గ్రామాల్లో రేషన్‌కార్డు లబ్ధిదారుల జాబితాలు వెల్లడించడంతో అవి చూసిన దరఖాస్తుదారులంతా షాక్‌కు గురయ్యారు. పది పేర్లలో కనీసం ఐదారు పేర్లు తప్పుల తడకగా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆయా లబ్ధిదారులు సివిల్‌సైప్లె, ఎమ్మాఆర్వో ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పులపై అధికారులను ప్రశ్నిస్తే, ‘మళ్లీ దరఖాస్తు చేసుకోండి. ఇక్కడికొచ్చి ఇబ్బంది పెట్టొద్దు’ అంటూ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చేసేదేమీ లేక దారఖాస్తుదారులు ప్రస్తుత జాబితాలోని పేర్ల తొలగింపునకు మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ తర్వాత మళ్లీ ఎక్కడ తమకు రేషన్‌కార్డు కావాలో అక్కడ దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ విధంగా ఒక్క వ్యక్తి రేషన్‌కార్డు కోసం రెండు మూడుసార్లు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొత్త రేషన్‌కార్డులకు సంబంధించి అర్హులైన వారి జాబితాను ప్రకటిస్తున్న ప్రభుత్వం.. వారికి కొత్త కార్డులు ఎప్పటినుంచి జారీ చేస్తారు? ఎప్పటినుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తారు? అనే అంశంపై స్పష్టత కరువైంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జనవరి 26 నుంచే కొత్త రేషన్‌కార్డులు అందాలి. ఆ తర్వాత గడువును ఉగాదికి పొడగించింది. కానీ, ఇప్పటివరకు కొత్త కార్డులు జారీ కాలేదు.