హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ధన్వంతరి ఫౌండేషన్ చేతిలో దారుణంగా మోసపోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు రోడ్డెక్కారు. దాదాపు 350 మంది బ్రాహ్మణ వయోధికులు ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించి ఆఫౌండేషన్ మోసాలను వివరించారు.
అగ్రహారాల నిర్మాణం, సేవా కార్యక్రమాల పేరుతో ధన్వంతరి ఫౌండేషన్ నిర్వాహకులు తమ నుంచి రూ.1,000 కోట్ల వరకు వసూలు చేశారని, ఆ సొమ్మును డొల్ల కంపెనీల్లోకి మళ్లించడం ద్వారా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పంతంగి కమలాకరశర్మ, ఆయన కుటుంబసభ్యులు అక్రమంగా ఆస్తులను కూడబెట్టుకున్నారని తెలిపారు. వాటి వేలం ద్వారా వచ్చిన సొమ్ము ను తమకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరా రు. కమలాకరశర్మ పాస్‌పోర్టులను సీజ్ చేయాలని, ధన్వంతరి ఫౌండేషన్ మోసాలపై ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.