RRR | చౌటుప్పల్, సెప్టెంబర్ 27: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు భూ నిర్వాసితులు కదం తొక్కుతున్నారు. అలైన్మెంట్ మార్చే వరకు పోరాటం ఆగదని, హైదరాబాద్ నడిబొడ్డుకు కాదు ఢిల్లీకైనా సిద్ధమేనని ప్రకటించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం శుభం గార్డెన్లో శుక్రవారం ట్రిపుల్ ఆర్ బాధితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భూ నిర్వాసితులు సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి చౌటుప్పల్, వలిగొండ మండలాల్లోని రైతులు పెద్దసంఖ్యలో వచ్చారు. అక్టోబర్1న ఇందిరపార్కు వద్ద ధర్నా చేయాలని రైతులు చర్చించుకున్నారు. పలువురు రైతులు మాట్లాడుతూ ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్కు నాలుగు ప్రధాన రహదారులకు 40కిలోమీటర్లు దూరంలో జంక్షన్ ఏర్పాటు చేశారని, కానీ చౌటుప్పల్, భువనగిరి ప్రాంతాల్లో కేవలం 28కిలోమీటర్లు రంలో నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలుస్తామని తెలిపారు.
సీఎం, మంత్రులవి పొంతన లేని మాటలు
సీపీఎం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే అలైన్‌మెంట్‌పై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, వెనక్కి తగ్గేదిలేదని చెప్పారని. కానీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం జంక్షన్ 40కిలోమీటర్ల దూరం వెళ్తున్నదని చెబుతున్నారని తెలిపారు. సీఎం, మంత్రుల పొంతన లేని మాటలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ట్రిపుల్ ఆర్‌పై మాట్లాడడం లేదని మండిపడ్డారు.
ఫార్మాసిటీపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి
వేలాది మంది యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెచ్చిన ఫార్మాసిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ నేత భరత్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. ఫార్మాసిటీ విషయంలో హైకోర్టుకు కూడా అబద్ధాలు చెబుతున్నారని అని విమర్శించారు.ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేయదలుచుకుంటే రైతుల నుంచి సేకరించిన 14 వేల ఎకరాలను తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు ఫ్యూచర్‌సిటీ అంటూ హంగామా చేస్తూ రియల్ఎస్టేట్ దందాకు తెరలేపిందని దుయ్యబట్టారు.
ఢిల్లీదాకా వెళ్తాం..
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చకపోతే మరింత ఉద్యమిస్తాం. హైదరాబాద్ ఇందిరపార్కు వద్ద ధర్నాకు సిద్ధమయ్యాం. ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఢిల్లీ దాకా వెళ్తాం. కేంద్రమంత్రులను కూడా కలుస్తాం.
-చింతల దామోదర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, చౌటుప్పల్
పంట భూములను ఆగం చేస్తరా?
నాకు 11 ఎకరా ల భూమి ఉన్నది. వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకు తున్న. మా అయ్య కష్టపడి సంపాందించిండు. సగానికిపైగా రోడ్డుకు పోతున్నది. మా కుటుంబం ఎట్ల బతకాలె. పంట భూములను ఆగం చేస్తరా?
-వల్లూరిబోగయ్య, మందోళ్లగూడెం