Hydraa | దర్వాజకు కట్టిన మామిడాకుల తోరణం ఎండనేలేదు. గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ పండనే లేదు.. కానీ గూడు చెదిరి, గుండె ముక్కలైంది. కలల సౌధం కండ్లముందే శిథిలమైంది. జీవితాంతం కష్టపడి ఇల్లు కట్టుకుంటే.. వారం రోజులకే నిర్దాక్షిణ్యంగా హైడ్రా బుల్డోజర్లు కూల్చివేశాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్‌గూడకు చెందిన సత్యనారాయణ కుటుంబం ఆ షాక్ నుంచి నేటికీ తేరుకోలేకపోతున్నది. అన్ని పత్రాలు, అనుమతులతో ఇల్లు కట్టుకుని, సెప్టెంబర్ 16న గృహప్రవేశం చేశానని, 22న అధికారులు వచ్చి కూలగొట్టారని విలపిస్తున్నాడు బాధితుడు.
పటాన్చెరు, అక్టోబర్ 15: సత్యనారాయణది ఒడిశా. హైదరాబాద్‌తో రెండు దశాబ్దాల అనుబంధం. 1998లో హైదరాబాద్‌లోని టర్బో పరిశ్రమలో ఉద్యోగిగా చేరాడు. 2009లో ఒడిశా వెళ్లిపోయాడు. తన కుమారుడికి హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావటంతో హైదరాబాద్‌పై మనసు మళ్లింది. రిటైర్మెంట్ జీవితం హైదరాబాద్‌లోనే గడిపేద్దామనుకున్నాడు.
తన వద్ద ఉన్న సేవింగ్స్, ఇతర ఆర్థిక వనరులను సమకూర్చుకుని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్‌గూడలో 167 గజాల ప్లాటును కొనుగోలు చేశాడు. అన్ని పత్రాలు, పంచాయతీ అనుమతులు, బ్యాంకు లోన్ సౌకర్యం, ఇతర సౌకర్యాలు చూసి ఆ స్థలాన్ని 2022లో కొన్నాడు. బ్యాంక్‌లోన్, ఇతర అప్పులు చేసి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకున్నాడు. గత నెల 16న అంగరంగ వైభవంగా గృహప్రవేశం కూడా జరుపుకొన్నాడు.
సరిగ్గా ఐదు రోజులకు సెప్టెంబర్ 21న గ్రామపంచాయతీ సిబ్బంది వచ్చి ఆదరబాదరగా వచ్చి ఇంటి గోడకు నోటీసు అంటించి వెళ్లిపోయారు. సంబంధిత స్థలం సర్వే నంబర్ 12 ప్రభుత్వానిదని, హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగం యాక్షన్ తీసుకోబోతున్నదని ఆ నోటీసు సారాంశం. సత్యనారాయణకు ఏం అర్థంకాక పంచాయతీ అధికారులు, స్థలం అమ్మిన వెంచర్ యజమానిని అడిగారు. వారు పరిస్థితిని సర్దుతామని, ఎక్కడో తప్పు జరిగిందని, మీరున్నది సర్వే నంబర్ 6 అని, అది ప్రైవేటు సర్వే నంబర్ అని నమ్మించారు.
అదే సమయంలో సత్యనారాయణ భార్యకు జ్వరం రావటంతో 21న దవాఖానలో జాయిన్ చేశాడు. దవాఖానలో భార్య చికిత్సకోసం ఉండగానే 22న తెల్లవారే ఆయన ఇంటిని హైడ్రా బృందం కూల్చేస్తున్నదని ఫోన్ వచ్చింది. హుటాహుటిన దవాఖాన నుంచి తన ఇంటికి వచ్చిన సత్యనారాయణను ఇంటి వద్దకు కూడా వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎంత మొత్తుకున్నా సామగ్రిని బయటకు పారవేసి కండ్లముందే ఇంటిని కూల్చేశారు.
జీవితమంతా కష్టపడి సంపాదించిన డబ్బు కండ్ల ముందు ఇటుక పెల్లలుగా మిగిలిపోయింది. ఒక్కో ఇంటిలో ఒక్కో బాధితుడిది ఒక్కో కథ. అసలు వారు చేసిన తప్పు చెప్పేందుకు అన్ని పర్మిషన్లు ఇచ్చిన పంచాయతీ ముందుకు రావటంలేదు. అది అసలు ఏ సర్వే నంబరో చెప్పేందుకు సర్వేయర్లు కనిపించటం లేదు. బ్యాంకర్లు లీగల్‌గా ఎందుకు పప్పులో కాలేశారో..! రూ.కోట్ల రుణాలు ఎలా ఇచ్చారో అర్థం కాక నిట్టూరుస్తున్నారు.
బలవంతంగా తన్ని తరిమేస్తున్నారు: బాధితులు
ఇండ్లలో నివాసం ఉంటే బలవంతంగా ఖాళీ చేయించబోమన్న హైడ్రా కమిషనర్, ముఖ్య అధికారుల మాటలకు.. క్షేత్రస్థాయిలో హైడ్రా సిబ్బంది, రెవెన్యూ యంత్రాంగం, మున్సిపాలిటీ సిబ్బంది హడావిడికి సంబంధం ఉండటం లేదు. హైడ్రా పేరున తమకు విపరీత శక్తులు వచ్చాయనే భావనలో పలు శాఖలు వ్యవహరిస్తున్నాయి. వీరికి మద్దతుగా పోలీసులు, మూడంచెల హైడ్రా భద్రత సిబ్బంది.. నిరసనకారులు, ఇండ్లలో ఉన్నవారిని బలవంతంగా దూరంగా తన్ని తరిమేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు కనిపించినా మొదటి అంచెలోనే తిప్పి పంపిస్తున్నారు.
కోర్టు ఆర్డర్లు, ఇండ్లలో ఉన్న యజమానుల కోణం, పత్రాలను అసలే పట్టించుకోవటం లేదు. ఈనెల 22న ఆదివారం వందలాదిగా వచ్చిన హైడ్రా సిబ్బంది పటేల్‌గూడలో జేసీబీలు, బుల్డోజర్లతో స్వైరవిహారం చేశారు. సర్వే నంబర్ 12 అని చెప్పి 26 ఇండిపెండెంట్ హౌస్‌లను కూల్చేశారు. అక్కడ 32 ప్లాట్లు ఉండగా వాటిలో 1 నిర్మాణం కాలేదు. వాటిలో 26ని పూర్తిస్థాయిలో నేలమట్టం చేశారు. ఆయా ఇండ్ల యజమానులు ఎంత ఎడ్చినా, బతిమాలినా, కాళ్లు పట్టకొని కనికరించాలని వేడుకున్నా అధికారులు స్పందించలేదు. తమ ఇంటిని కూల్చివేయకుండా ఫైన్ వేస్తే కట్టుకుంటామని కూడా కొందరు ఇండ్ల యజమానులు బతిమాలారు.
పంచాయతీకి ట్యాక్స్‌లు కట్టామని, వెంచర్‌కు కూడా పర్మిషన్లు ఉన్నాయని చెప్పినా అరణ్య రోదనలుగానే మిగిలిపోయాయి. సర్వే నంబర్ 12 అని అధికారులు గుర్తించినప్పుడు రెండంతస్థుల ఇంటి నిర్మాణం పూర్తి అయ్యేవరకు ఎలా ఉపేక్షించారని బాధితులు నిలదీస్తున్నారు. హైడ్రా పేరుతో జరుపుతున్న అరాచకంతో తాము నిరాశ్రయులమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 3న పటేల్‌గూడ పంచాయతీ అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనమైంది. ఆ వెనువెంటనే హైడ్రా 26 ఇండ్లను నేలమట్టం చేసింది.
జీవితమంతా కష్టపడి ఇల్లు కట్టుకున్నా
జీవితమంతా కష్టపడుతూనే ఉన్నా సారు. నా సొంతూరు రాజమండ్రి. చిన్నప్పుడే ఒడిశాకు వెళ్లి సెటిలయ్యాం. 1998లో ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వచ్చా. 2009 వరకు ఇక్కడే ఉన్నా. ఆ తర్వాత ఒడిశా వెళ్లిపోయాను. నా కొడుక్కి జాబ్ రావడంతో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాం. 2022లో ఈ స్థలం సర్వే నంబర్ 6లో ఉన్నదని నిర్భయంగా కొన్నాం. ఇది ప్రభుత్వ స్థలం అని వారం కిందట అధికారులు నోటీసు పంపారు. గృహ ప్రవేశమైన ఆరు రోజుల్లోనే ఇంటిని కూల్చేశారు. దాదాపు రూ.కోటిన్నర ఖర్చు చేశాను. రిటైర్మెంట్లో ప్రశాంతంగా ఇక్కడే ఉందామని నా సంపాదన అంతా ఇక్కడే ధారపోశాను. అప్పులు కూడా చేశాను. ఇప్పుడు కూలిన ఇంటిని చూసుకుంటున్నా. ఇల్లును జలవనరుల్లో నిర్మించలేదు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అసలే కాదు. ఇక్కడ జరిగిన నష్టంపై విచారణ చేయాలి.
-బీ సత్యనారాయణ, పటేల్‌గూడ, అమీన్‌ఫూర్ మున్సిపాలిటీ
ఇల్లు కూల్చివేయడంతో అప్పులే మిగిలాయి
నేను మేస్త్రీగా పనిచేస్తున్నా. సర్వే నంబర్ 6లో స్థలం ఉన్నదని తెలిసి ప్లాటు కొన్నా. అప్పులు చేసి సొంత ఇంటిని నిర్మించాను. నిర్మాణరంగంలో అనుభవం ఉండటంతో పక్కన కడుతున్న ఇండ్లను కూడా గుత్తేదారుకి తీసుకుని పనులు చేసుకుంటున్నాను. ఇప్పుడు హైడ్రా వచ్చి నేను కట్టిన ఇంటిని కూల్చేసింది. గుత్తేదారుడిగా ఉన్న ఇంటిని కూడా కూల్చేశారు. రెండు ఇండ్లు పోవడంతో అప్పులే మిగిలాయి. ఇంటి గృహ ప్రవేశాలు చేసిన కొద్దిరోజుల్లోనే కూల్చివేశారు. అప్పులు ఇచ్చినవారు ఫోన్లు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచి 2004లో హైదరాబాద్ వచ్చాను. 20 ఏండ్లుగా కష్టపడి మేస్త్రీ పనులు చేస్తున్నాను. జీవితంలో స్థిరపడుతున్నాను అనుకుంటున్న టైంలో హైడ్రా తొందరపాటు వల్ల అన్ని నష్టపోయి రోడ్డునపడ్డాను.
– శివరావు, పటేల్‌గూడ, అమీన్‌ఫూర్ మున్సిపాలిటీ
అన్ని అనుమతులున్నా కూల్చివేశారు
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. పంచాయతీ అనుమతి, ఇంటి నంబరు ఉన్నప్పటికీ మా ఇంటిని కూల్చివేశారు. ముందస్తుగానే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలమని గుర్తిస్తే ఇల్లు కొనుక్కునేవాళ్లం కాదు. ఇంత నష్టపోయేవాళ్లం కాదు. దీనికంతటికి బాధ్యులు అధికారులే. కానీ, మమ్మల్ని దోషులుగా చేసి జీవితంలో పూరించుకోలేనంతగా నష్టం చేశారు. గత ప్రభుత్వం, ప్రభుత్వ స్థలాల్లో కట్టుకున్నవారికి 58, 59 జీవోల ద్వారా క్రమబద్ధీకరించారు. ఈ ప్రభుత్వానికి ఆ జీవోలు వర్తించవా? కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చి జీవితాలను నాశనం చేశారు.
-రాజు, బీరంగూడపైసాపైసా కూడపెట్టి
కొన్న ఇంటిని కూల్చారు
ఎంతో కష్టపడి పైసా పైసా కూడపెట్టుకుని కొనుక్కున్న ఇంటిని గంటలోనే కూల్చివేశారు. మేము అన్ని డాక్యుమెంట్లు చూసే కొనుక్కున్నాం. అధికారులు తప్పు చేస్తే దానికి మేమా బాధ్యులం? ఆ తప్పు ప్రభుత్వానిది కాదా? తప్పు చేసిన వారిని వదిలిపెడుతున్నారు. ప్రభుత్వ అధికారులు అయినంత మాత్రాన ప్రభుత్వం వెనకేసుకొస్తుందా? మాలాంటి సామాన్యులను బలిచేస్తే మీ ప్రభుత్వానికి ఏమొస్తుంది? మా ఇల్లు కూల్చినప్పటి నుంచి మా భార్య, పిల్లలు తిండి, నిద్ర లేకుండా బతుకుతున్నాం. మళ్లీ ఒక ఇల్లు కట్టుకోవాలంటే మా జీవితం సరిపోదు. పేదవాళ్లకు న్యాయం చేసే ప్రభుత్వం ఉండాలి గాని అన్యాయం చేసే ప్రభుత్వాలు ఉంటే భవిష్యత్తు ఉండదు.
– సంతోష్, బీరంగూడ