సుబేదారి, జూన్ 16 : నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని బాధితుడు దేవర రమేశ్ ఆరోపించాడు. ఈ మేరకు ఆయన హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడాడు. హనుమకొండలోని ములుగురోడ్డు కాపువాడలో సర్వేనంబర్ 769లో వారసత్వంగా వచ్చిన భూమి ఉండగా అందులో తాను చాలా ఏండ్ల క్రితమే షెడ్డు నిర్మించినట్టు తెలిపాడు. తన భూమి పక్కనే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి భూమి ఉన్నదని, నాలా కూడా ఆక్రమించుకున్నట్టు పేర్కొన్నాడు. తమ భూమిని కబ్జా చేయడానికి చాలా ఏండ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపించాడు. కోర్టు కమిషన్ నియమించి 2004లో ఆ భూమి తమదేనని జడ్జిమెంట్ ఇచ్చినట్టు తెలిపాడు.
ఎట్లయినా తన భూమిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మాధవరెడ్డి రాజకీయ బలంతో కొద్దిరోజుల నుంచి అతని తమ్ముడు తిరుపతిరెడ్డిని ముందు పెట్టి అనుచరులను తమ ఇంటికి పంపించి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని వాపోయాడు. వారం రోజుల క్రితం ఎమ్మెల్యే సోదరుడితోపాటు వారి మనుషులు పది మంది వచ్చి బోరు వేయకుండా అడ్డుకున్నట్టు తెలిపాడు. మళ్లీ ఆదివారం అర్ధరాత్రి అనుచరులను పంపి తమ షెడ్డు గేటుకు వైర్ కట్టి, ప్రహరీ, బోరును ధ్వంసం చేసినట్టు రమేశ్ వాపోయాడు. హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, ఎమ్మెల్యే, అతని అనుచరులతో తనకు ప్రాణభయం ఉన్నదని, రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నా డు. ఈ ఘటనపై హనుమకొండ ఇన్స్పెక్టర్ను ఫోన్ ద్వారా వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.