హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై దర్యాప్తు జరపాలని కోరుతూ నమోదైన ప్రైవేటు ఫిర్యాదులో కింది కోర్టు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని జస్టిస్ కే లక్ష్మణ్ ప్రకటించారు. అంతకుముందు ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ఫిర్యాదుదారు నాగవెల్లి రాజలింగమూర్తి మరణించినప్పటికీ ఆ ఫిర్యాదు వెనుక ప్రజాప్రయోజనం ఉన్నదని, ఆ ఫిర్యాదుపై కింది కోర్టులో విచారణ కొనసాగించాలని కోరారు.
ఫిర్యాదులో ఎనిమిది మంది సాక్షులున్నారని, వారిని విచారించే అధికారం కింది కోర్టుకు ఉన్నదని చెప్పారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడి కుమార్తె ఇంప్లీడ్ కావాలనుకుంటున్నట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయని తెలిపారు. ఈ వాదనను కేసీఆర్, హరీశ్ తరఫు న్యాయవాది టీవీ రమణారావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి మరణించినందున కింది కోర్టు ఎవరిని విచారిస్తుందనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసినవారు లేనప్పుడు ఆ ఫిర్యాదు విచారణార్హం కాదని, సుప్రీంకోర్టు తీర్పులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వివరించారు. అయినప్పటికీ పిటిషనర్లకు జిల్లా కోర్టు నోటీసులు జారీచేయడం చట్టవిరుద్ధమని చెప్పారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ స్పందిస్తూ.. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఎలా నిర్ణయాలు తీసుకోగలమని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ప్రశ్నించారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడి కుమార్తె ఇంప్లీడ్ అయితే అప్పుడు పరిశీలిద్దామని చెప్పారు. ప్రస్తుతం ఫిర్యాదుదారుడు జీవించి లేనందున ఆయన ఫిర్యాదుపై విచారణ చేయాలో లేదో తర్వాత తేలుస్తామని పేర్కొంటూ.. తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.