కొత్తగూడెం ప్రగతి మైదాన్, అక్టోబర్ 13 : పోరాట ఉద్యమాల్లో అస్త్ర సన్యాసం ఉండదని, మావోయిస్టు పార్టీ నేత మల్లోజుల వేణుగోపాల్ కర్మ సిద్ధాంతంలోకి జారుకుంటున్నాడని ఆరోపిస్తూ ఆ పార్టీ సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) కార్యదర్శి అశోక్ పేరుతో సోమవారం విడుదలైన లేఖ సంచలనం రేపుతోంది. ఈ సమాజంలో వర్గాలు అంతం కావాలని, కుల వివక్ష, ఆధిపత్యం, దోపిడీ లేని సమాజం కోసం భారతదేశంలో కొన్ని వందల ఏళ్లుగా ప్రజలు పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
1982లో సికాస ప్రారంభమైనప్పటి నుంచి కార్మికోద్యమం దేశంలోని అన్ని బొగ్గు గనుల ఉద్యమాలకు ఆదర్శమైందని పేర్కొన్నారు. పోరాటాలు, త్యాగాలు లేనిదే హక్కులు సాధించలేమనే స్ఫూర్తి ని సింగరేణి కార్మికుల్లో తమ సమాఖ్య నింపిందని గుర్తుచేశారు. సింగరేణి కార్మికుల పోరాటాల చరిత్ర వేణుగోపాల్‌కు తెలియనిది కాదని, ఇప్పుడు ఆ వాస్తవాలను వక్రబుద్ధితో దానిని తలకిందులుగా చూపే ప్రయత్నం చేయిస్తున్నాడని ఆరోపించారు. జినుగు నర్సింహారెడ్డి లాంటి ఒకరిద్దరిని ఏజెంట్లుగా పెట్టుకుని తేనె పూసిన కత్తిలా పని సాగిస్తున్నాడని విమర్శించారు.