పూడూరు, సెప్టెంబర్ 27: నేవీ రాడార్ సిగ్నల్ కేంద్రం ఏర్పాటును అడ్డుకొనేందుకు, దామగుండం అడవి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పరిరక్షణ జేఏసీ చైర్మన్ దేవనోనిగూడెం వెంకటయ్య పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం అడవి పరిరక్షణ జేఏసీ చైర్మన్గా వెంకటయ్యను ఎన్నుకున్నారు.
కమిటీ గౌరవ అధ్యక్షులుగా విజయ్ ఆర్య క్షత్రియ, మాజీ ఎంపీపీ మల్లేశం, సునంద బుగ్గన్న, విజయలక్ష్మి పండిట్, కోఆర్డినేటర్లుగా 19 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే నేవీ రాడార్ సిగ్నల్ కేంద్రం ఏర్పాటును విరమించుకోవాలని, లేని పక్షంలో అన్నిపార్టీలు, సంఘాలను ఏకంచేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.