Vemulawada | వేములవాడ, సెప్టెంబర్ 27: ‘అయ్యా మా ఇండ్లను కూలగొట్టొద్దు.. పడగొట్టకుండా చూడండి’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గుడి చెరువు వద్ద నివాసితులు శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు విన్నవించారు. ఇటీవల గుడి చెరువు వద్ద అధికారులు సర్వే చేసి, ఎఫ్టీఎల్లో నివాసాలు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఆందోళన చెందిన అక్కడి ప్రజలు శుక్రవారం వేములవాడ సహకార సంఘం వద్ద ఆది శ్రీనివాస్‌ను కలిశారు. తాము ఎన్నో ఏండ్ల కింద అనుమతులు తీసుకొని ఇండ్లు కట్టుకున్నామని తెలిపారు. సర్వేతో భయమవుతుందని, ఎలాగైనా మీరే కాపాడాలని చేతులెత్తి మొక్కుతూ వేడుకున్నారు. నివాసాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసే బాధ్యత తనదేనని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ వారికి హామీ ఇచ్చారు. అక్కడే ఆర్డీవో రాజేశ్వర్ కూడా ఉండటం గమనార్హం.