Vemulawada | వేములవాడ టౌన్ : దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ (Vemulawada) రాజన్న అలయంలో దర్శనాల విషయంలో అధికారులు అనుసరిస్తున్న వైఖరి భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నది. ఆలయ అభివృద్ధి నేపథ్యంలో ఇప్పటికే రాజన్న గుడిలో దర్శనాలు నిలిపివేసిన అధికారులు.. తాజాగా ఆలయంలోకి ప్రవేశించకుండా ప్రధాన ద్వారం వద్ద ఇనుప రేకులు అమర్చారు. కేవలం స్వామి వారి చతుష్కాల పూజలకు అర్చకులను మాత్రమే అనుమతిస్తున్నారు.
రాజన్న ఆలయ అభివృద్ధి నేపథ్యంలో భీమేశ్వరాలయంలోనే దర్శనాలతో పాటు కోడె మొక్కులు, ఇతర ఆర్జిత సేవలను నిర్వహిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సుమారు నెల రోజుల నుంచి ఆలయ పరిసరాలలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దక్షిణ, ఉత్తర భాగాలలో ప్రాకారం, పడమర వైపు ఉన్న నైవేద్య శాల, ఆలయ ఈవో కార్యాలయం ఇప్పటికే తొలగించారు. ఆలయం చుట్టూ పలు ప్రాంతాల్లో భక్తులు లోనికి రాకుండా ఇప్పటికే ఇనుప రేకులు అమర్చారు. తాజాగా, బుధవారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన ద్వారాన్ని కూడా ఇనుప రేకులతో మూసివేశారు. దేవాదాయ కమిషనర్, ఆలయ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా ఆలయాన్ని మూసివేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్తీక మాసం కావడంతో వేములవాడకు భక్తులు భారీగా తరలివచ్చినప్పటికీ పునర్నిర్మాణం పేరిట ఆలయ ప్రధాన ద్వారం మూసివేయడంతో భక్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. రాజన్న ఆలయం ముందు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లకే మొక్కి వెళ్లిపోతున్నారు. దీంతో రాజన్న ఆలయం భక్తులు లేక వెలవెలబోతున్నది.

Vemulawada Rajanna Temple2

Vemulawada Rajanna Temple1