Vemulawada Rajanna Temple | వేములవాడ టౌన్, మార్చి 30 : వేములవాడ రాజన్న గోశాలలో నాలుగు కోడెలు మృతి చెందాయి. ఎండలతో అనారోగ్యం బారినపడి చనిపోతున్నాయని వైద్యులు చెబుతుండగా.. భక్తులు మాత్రం మెరుగైన సౌకర్యాలు లేకపోవడం వల్లేనని ఆరోపిస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధంగా ఉన్న తిప్పాపురం గోశాలలో 650 కోడెలు ఉన్నాయి. విశాలమైన స్థలం లేకపోవడంతో పెద్ద కోడెలు, చిన్న కోడెలు పొడుచుకుంటున్నాయని, రాజన్నకు రైతులు సమర్పించే కోడెల్లో కొన్ని అనారోగ్యంతో ఉంటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
గోశాలలో సోమవారం నాలుగు కోడెలు మృతి చెందగా, మరో ఐ దు అనారోగ్యంతో కోడెలకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. గోశాలలో స్థలం చిన్నగా ఉన్నదని, పెద్ద కోడెలు, చిన్నకోడెలను వేరు చేసి ఉంచితే ఇలాంటి ప్రమాదాలు తగ్గుతాయని, ఎండవేడి నుంచి ఉపశమనం కలిగేలా సౌకర్యాలు కల్పించాలని భక్తులు సూచిస్తున్నా రు. రాజన్నకు కోట్ల ఆదాయం వస్తున్నా కోడెలకు సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు.