గీసుగొండ, డిసెంబర్ 22 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ కోడెలను రైతుల పేరిట తీసుకొచ్చి కబేళాలకు విక్రయించిన ముగ్గురు నిందితులను పోలీసులు మూడు రోజుల విచారణ నిమిత్తం శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులైన గీసుగొండ మండలం మనుగొండ ప్రాంతానికి చెందిన మాదాసి రాంబాబు, అనంతారాం గ్రామానికి చెందిన మంద స్వామి, దుగ్గొండి మండలం చలపర్తి గ్రామానికి చెందిన పసునూటి శ్యామ్సుందర్ను పోలీసులు విచారిస్తున్నారు.
రాజన్న కోడెల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి నడుస్తున్నది? ఎక్కడెక్కడ కోడెలను విక్రయించారు? ఎలాంటి ఆధారాలు చూడకుండా వాటిని వేములవాడ ఆలయ అధికారులు ఎలా ఇచ్చారనే కోణంలోనూ వారు విచారిస్తున్నట్టు తెలిసింది. రాజన్న ఆలయ అధికారులు, సిబ్బంది, గోశాల నిర్వాహకుల్లో ఎవరెవరి ప్రమేయం ఉన్నదనే విషయమై పోలీసులు వివరాలు రాబడుతున్నట్టు సమాచారం.