రవీంద్రభారతి, నవంబర్21: సీఎం రేవంత్‌రెడ్డిని ఓటుకు నోటు కేసు భయం వెంటాడుతున్నదని, అందుకే 42% బీసీ కోటా కోసం కేంద్ర ప్రభుత్వంపై కనీస పోరాటమే చేయడం లేదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్గలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అఖిలపక్షాన్ని ఎందుకు ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బీసీ కోటా అమలుపై ఎందుకు ఒ త్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. బీసీలను నయవంచన చేయడానికి రేవంత్‌రెడ్డి పెద్ద కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఈ అంశంపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నా.. ఆ ప్రయత్నమే చేయకుండా సీఎం చేతులెత్తేశారని మండిపడ్డారు.
ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, లేనిపక్షంలో మంత్రులను, ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. బీసీ కోటా తగ్గింపుపై తెలంగాణకు చెందిన బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎం దుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆమోదం తెలిపి.. ఢి ల్లీలో ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పి తీరాలని నిలదీశారు. ఇలాగే బీజేపీ రాష్ట్ర నేతల తీరు ఉంటే తెలంగాణ లో ఆ పార్టీకి నూకలు చెల్లినట్టేనని స్పష్టంచేశారు.