హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : మొదట్నుంచీ చెప్తున్నట్టే కాంగ్రెస్, బీజేపీ నేతల అసలు రంగు బయట పడుతున్నదని, కేటీఆర్‌ను టార్గెట్ చేసి రెండు పార్టీల నేతలు ఒకే రకంగా అరెస్టు చేయాలని మాట్లాడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నేతలది అజబ్ ప్రేమ్‌కి గజబ్ కహానీ అని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌పై ఏబీసీ అక్రమ కేసు బనాయించగానే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు క్యూకట్టి మరీ కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఏసీబీని ప్రభావితం చేస్తున్నారా? ఆదేశాలు ఇస్తున్నారా? అని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దారిలోనే బీజేపీ నేతలు కూడా కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని అనడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు.
తెలంగాణభవన్‌లో గురువారం ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, జాజల సురేందర్, జడ్పీ మాజీ చైర్మన్లు టీ రాజు, దాదన్నగారి విఠల్‌రావు, నాయకులు కురవ విజయ్‌కుమార్, సత్యనారాయణరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీలు ఈడీని ప్రభావితం చేస్తున్నారా? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో బంధం కొనసాగిస్తున్నారని ఎద్దేవాచేశారు. బీజేపీ కార్యాలయంపై దాడి విషయంలో వెంటనే స్పందించిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, భువనగిరిలోని బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడుల గురించి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా చెప్పిన అబద్ధాలనే ఢిల్లీలోనూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారని, మహారాష్ట్ర తరహాలోనే ఢిల్లీలోనూ కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్న రేవంత్‌రెడ్డి.. 400 రోజులైనా నెరవేర్చలేదని, మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను ప్రజలు నమ్మలేదని, అందుకే ఆయన ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని గుర్తుచేశారు. గతంలో సోనియాగాంధీని తెలంగాణ బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి, నేడు అదే నోటితో ఆమెను గొప్ప నాయకురాలని ప్రశంసిస్తున్నారని వేముల మండిపడ్డారు. రాహుల్‌గాంధీ నాలుగు నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, రాహుల్ దృష్టిలో పడేందుకే ఇవాళ రేవంత్ సోనియాను పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు.
చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, బాధ్యత గల నాయకుడిగా కేటీఆర్ గతంలో ఏసీబీ, నేడు ఈడీ విచారణకు హాజరయ్యారని వేముల చెప్పారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి కక్షతో పెట్టిన అక్రమ కేసని, ఇందులో నయా పైసా అవినీతి జరగలేదని కేటీఆర్ మొదట్నుంచీ చెప్తున్నారని అన్నారు. అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టినా, విచారణ సంస్థలకు కేటీఆర్ పూర్తి సహకారం అందిస్తున్నారని గుర్తుచేశారు. ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహంతో కొందరు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారని విమర్శించారు.
పోలీసులు రేవంత్‌రెడ్డి చెప్పినట్టు కాకుండా చట్టానికి లోబడి పని చేయాలని, లేకుంటే అన్ని రోజులు ఒకేలా ఉండవని హెచ్చరించారు. ఎందరో ప్రముఖులు, కేంద్ర మంత్రులు ఈ-రేసును ప్రశంసించారని, దీని వల్ల హైదరాబాద్‌కు రూ.700 కోట్ల ప్రయోజనం చేకూరిందని గుర్తుచేశారు. రెండోసారి రేసు జరగకుండా సీఎం రేవంత్‌రెడ్డి రద్దు చేయడంతో రాష్ర్టానికి నష్టం జరిగిందని, కేసు పెట్టాల్సి వస్తే సీఎం రేవంత్‌రెడ్డిపైనే పెట్టాలని డిమాండ్ చేశారు. ఈడీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ముఖ్యమంత్రిని విచారణ చేయాలని కోరారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగంలో ఉన్న ప్రతి అవకాశాన్ని బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుందని వేముల చెప్పారు. కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో తనది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అధికారికంగా ప్రకటించారని, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు కేటీఆర్ భయపడే రకం కాదని హితవుపలికారు. తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉన్నదని, కాంగ్రెస్ కుట్రలను ఛేదించుకొని కడిగిన ముత్యంలా కేసునుంచి కేటీఆర్ బయటకొస్తారని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 13 హామీలు, 420 వాగ్దానాలు అమలు అయ్యేదాక తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు.