Vemula Prashanth Reddy | సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్టుల్లో జరిగిన స్కామ్‌ను బయటపెట్టినందుకే హరీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రెండేళ్ల నుంచి మంత్రులు అనేక కుంభకోణాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆ కుంభకోణాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన హరీశ్‌రావుపై కావాలనే నోటీసులు ఇచ్చారని తెలిపారు.
అసెంబ్లీ వేదికగా, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కుంభకోణాలను బయటపెడుతుంటే మాపై కేసులు పెడుతున్నారని అన్నారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేస్, విద్యుత్ కేసు పేరుతో విచారణకు పిలిచి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్కచినా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా ప్రభుత్వాన్ని నడిపిస్తుందని వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. దండుపాళ్యం బ్యాచ్‌కు నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. ఈ బ్యాచ్‌లో మంత్రులు కూడా ఉన్నారని అన్నారు. సివిల్ సప్లయిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది.. సమ్మక్క సారలమ్మ టెండర్ల విషయంలో మంత్రుల మధ్య కొట్లాట జరిగిందని తెలిపారు. పారిశ్రామిక భూములను రేవంత్ రెడ్డి తన బంధువులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. హ్యామ్ రోడ్ల పేరిట కుంభకోణం జరగబోతుందని అన్నారు. రూ.1600 కోట్ల విలువైన బొగ్గు గనుల కాంట్రాక్ట్ విషయంలోనే ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య గొడవ వచ్చిందని తెలిపారు.
రోజుకొక కుంభకోణంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలపై కూడా సిట్ వేయాలని డిమాండ్ చేశారు. టీవీ సీరియల్లా రోజుకో కేసు పేరుతో డ్రామా నడిపిస్తున్నారని అన్నారు. అవినీతిపై ప్రశ్నిస్తుంటే మాపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా రేవంత్ రెడ్డి అవినీతిని బయటపెడుతూనే ఉంటామన్నారు. ప్రజల కోసం జైలుకెళ్లిన వ్యక్తి హరీశ్‌రావు అని తెలిపారు. మేం కేసీఆర్ సైనికులం.. ఇలాంటి బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు. హరీశ్‌రావు వెంట యావత్ తెలంగాణ సమాజం ఉందన్నారు.