హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ) : కొత్త రోడ్ల అభివృద్ధి పేరిట కాంగ్రెస్ రూ.8వేల కోట్ల లూటీకి తెరతీసిందని, ప్రభుత్వం తెచ్చింది హ్యామ్ మాడల్ కాదు.. పక్కా స్కామ్ మాడల్’ అంటూ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి బడ్జెట్లో రూ.వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం కనీసం 25శాతం కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో తొమ్మిదిన్నరేండ్ల్లలో 10వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించారని గుర్తుచేశారు. రేవంత్ రెండున్నరేండ్ల పాలనలో కొత్తగా వేసిన రోడ్లు 112 కి.మీలు మాత్రమేనని దుయ్యబట్టారు. 60ఏండ్ల సమైక్యపాలనలో 30లక్షల చదరపు అడుగుల బిల్డింగ్స్ నిర్మిస్తే, కేసీఆర్ పాలనలో 2కోట్ల చదరపు అడుగులు నిర్మించారని వివరించారు. ఈ గణంకాలే రోడ్ల అభివృద్ధిపై కాంగ్రెస్ చిత్తశుద్ధిలేమికి అద్దంపడుతున్నదని ధ్వజమెత్తారు. నిధులివ్వకపోవడంతో రాష్ట్రంలోని రహదారులు అధ్వానంగా మారినా ప్రభుత్వం కనీసం ప్యాచ్‌వర్క్ కూడా చేయడం లేదని, ఫలితంగా వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్అండ్బీ, పీఆర్ రోడ్ల నిర్మాణంలో సర్కార్ నిర్లక్ష్యాన్ని గణాంకాలతో ఎండగట్టారు. బాల్కొండ నియోజవర్గంలోని కప్పలవాగు వంతెన వర్షాలకు దెబ్బతిని తొమ్మిది నెలలు గడిచినా కేవలం రూ.3 కోట్లు వెచ్చించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కార్ రెండు బడ్జెట్లలో రూ.4,800 కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం రూ.1,200 కోట్లు(25 శాతం) కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఈ నిధులు పాత బిల్లులు చెల్లించేందుకు కూడా సరిపోవని దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదని చెప్పారు. ‘కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో రోడ్లు, వంతెనల అభివృద్ధి కోసం ఏడాదికి రూ. 2,600 కోట్ల చొప్పున రూ.25వేల కోట్లు విడుదల చేసిందని.. తాము చేసినట్టు ఇప్పుడు పనులు జరుగాలంటే రూ.4వేల కోట్లు విడుదల చేయాలని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 నుంచి ఇప్పటివరకు 524 రోడ్లు మంజూరు చేసి 49 పనులు(9 శాతం) పూర్తిచేసిందని.. 2,070 కి.మీటర్ల రోడ్లు మంజూరు చేస్తే నిర్మించింది 112 కి.మీ.లేనని తెలిపారు. ఇది తాను చెప్పడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ఆర్అండ్బీ మంత్రి సమాధానమిచ్చారని గుర్తుచేశారు. రెండున్నరేండ్లలో పాతవి, కొత్తవి కలిపి నిర్మించిన రోడ్లు కేవలం 300 కిలోమీటర్లేనని స్పష్టంచేశారు. 60 ఏండ్లలో 6వేల కి.మీ డబుల్రోడ్లు వేస్తే కేసీఆర్ హయాంలో సుమారు 8,439 కి.మీల మేర సింగిల్లేన్ను డబుల్ లేన్‌గా మార్చామని, 485 కి.మీల మేర ఫోర్‌లేన్ రోడ్లు వేశామని ప్రశాంత్‌రెడ్డి వివరించారు.
అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో తెలంగాణ సమాజం గర్వపడేలా కేసీఆర్ నిర్మించిన సచివాలయం, అమరజ్యోతి, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ సర్కార్ రాజకీయ కక్షతో గాలికొదిలిసేందని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. సచివాలయం ప్రారంభించి మూడేండ్లు దాటినా నిర్వహణకు నయాపైసా ఇవ్వలేదని, ఐఐటీ, జేఎన్టీయూ నిర్దేశించిన మేరకు ఆరు నెలలకోసారి మెయింటెనెన్స్ చేయడం లేదని మండిపడ్డారు. ప్రపంచంలోనే అరుదైన స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణాల్లో ఒకటైన అమరజ్యోతిని ఊడ్చే నాథుడే లేడని, సెల్లార్లలో ఖరీదైన మోటర్ల వైరింగ్‌ను ఎలుకలు కొరుకుతున్నా పట్టించుకొనే వారేలేరంటూ విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ విగ్రహానికి తాళాలు వేసి బంధించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వమే ధ్వంసం చేయడం శోచనీయమని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
హ్యామ్ ముసుగులో కాంగ్రెస్ సర్కార్ అవినీతికి తెరతీసిందని ప్రశాంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆర్‌అండ్‌బీలో సుమారు 6,092 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.13వేల కోట్లతో టెండర్లు పిలిచారని తెలిపారు. గతంలో ఎన్నడూలేనివిధంగా 10శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ పద్ధతిని తీసుకొచ్చి పనులు మొదలు పెట్టకముందే కాంట్రాక్టర్లకు ఆర్అండ్ బీ ద్వారా రూ.1,300 కోట్లు, పీఆర్ ద్వారా రూ.600 కోట్లు కలిపి మొత్తం రూ.1,900 కోట్లు కాంట్రాక్టర్లకు అప్పజెప్పారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పాత, ప్రస్తుతం నడుస్తున్న పనుల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడంలోని మర్మమేంటని ప్రశ్నించారు. టెండర్లలో 5శాతం ఎక్సెస్ నిబంధనను ఎత్తివేశారని దీంతో 40శాతం వరకు మార్జిన్ వచ్చేలా పథకం రూపొందించారని ఆరోపించారు. సుమారు రూ.5,200 కోట్లు ఆర్అండ్బీ పనుల్లో, రూ.2400 కోట్లు పీఆర్ పనుల్లో మొత్తం రూ.7,600 కోట్ల దోపిడీకి తెరలేపారని ధ్వజమెత్తారు. సాధారణంగా కి.మీ డబుల్ రోడ్డు వైడెనింగ్కు రూ.1.75 కోట్లు ఖర్చయితే, హ్యామ్ సిస్టంలో రూ.3.30 కోట్లు డబుల్ చూపిస్తూ ప్రజాధనాన్ని దోచుకొనేందుకు యత్నిస్తున్నారని నిప్పులు చెరిగారు.
15 ఏండ్ల మెయింటెనెన్స్ పేరుతో ఏటా 4శాతం నిధులను 15సార్లకు గానూ రెండు విడుతల చొప్పున 8శాతం నిధులను కేటాయించడం ద్వారా రూ.10 వేల కోట్ల వరకు కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు. హ్యామ్‌లో చేపట్టిన రోడ్లను రూ.6,100 కోట్లతో పూర్తిచేయవచ్చని వివరించారు. కానీ రూ.13వేల కోట్లలో ప్రభుత్వం సమకూర్చే నిధులు 40శాతం అంటే రూ.5,200 కోట్లేనని వివరించారు. ఇందుకు హ్యామ్ మోడల్ అవసరం లేదని, దోపిడీ కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. 34 ప్యాకేజీలను 20శాతం ఎక్సెస్‌తో ఐదారుగురు కాంట్రాక్లర్లు దక్కించుకొనేలా పథకం రూపొందించారని తూర్పారబట్టారు. ఈ కుంభకోణంపై విజిలెన్స్ కమిషన్‌తో పాటు అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అంతేగాకుండా ప్రజాక్షేత్రంలోనూ బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.
ట్రిపుల్ ఆర్‌పై ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ట్రిపుల్ ఆర్కు రూపకల్పన చేశారని, 2015లోనే అలైన్మెంట్, డిజైన్ పనులు పూర్తిచేస్తే కేంద్రం కాలయాపన చేసి 2021లో భారత్‌మాలా ప్రాజెక్టులో చేర్చిందని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలోనే యుద్ధప్రాతిపదికన 80శాతం 3డీ సర్వే పనులు పూర్తిచేస్తే, 27నెలల కాంగ్రెస్ హయాంలో మిగతా 20శాతం సర్వే పనులు మాత్రమే చేసి భూసేకరణకు నయాపైసా వెచ్చించలేదని దుయ్యబట్టారు. 2024 డిసెంబర్ 29న నార్త్ ట్రిపుల్ ఆర్కు టెండర్లు పిలిచినప్పుడు ఫిబ్రవరి 2025లో పనులు మొదలుపెట్టి రెండేండ్లలో పూర్తిచేస్తామని మంత్రి వెంకట్‌రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారని, కానీ 15 నెలలు దాటినా టెండర్ల తెరువలేదని ధ్వజమెత్తారు. వాస్తవానికి ప్రాజెక్ట్‌కు కేంద్రం ఆమోదం లభించలేదని, ఈ విషయాన్ని ప్రభుత్వమే బడ్జెట్ పద్దుల్లో వెల్లడించిందని గుర్తుచేశారు. గత రెండు బడ్జెట్ల్లో ట్రిపుల్ ఆర్కు రూ.1,525 కోట్లు కేటాయించినా రూపాయి కూడా ఖర్చుచేయలేదని విమర్శించారు. దక్షిణ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ను కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా మార్చుకొనేందుకే కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.