Prashanth Reddy | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ‘డిసెంబర్ 9న చేయాల్సిన రూ.2 లక్షల రుణమాఫీని ఏడు నెలలు ఆలస్యం చేసి, రైతులకు రూ.31వేల కోట్ల రుణమాఫీ అని గొప్పలు చెప్పుకొని తీరా రూ.6వేల కోట్లే మాఫీచేసి సంబురాలు చేసుకుంటూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది’ అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేర కు వానకాలం సీజన్‌కు ఎకరానికి రూ.7500 చొప్పున రైతు భరోసా కింద ఇవ్వాల్సిన రూ.11,250 కోట్లు ఎగ్గొట్టి, ఆ డబ్బుల్లోంచి రుణమాఫీ కింద రూ.6,098 కోట్లు విదిల్చి ఏదో ఘనకార్యం చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నదని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో దుయ్యబట్టారు.
‘కొండను తవ్వి ఎలుకను పట్టినందుకు సంబురాలు చేసుకోవాలా?.. కాంగ్రెస్ చేసిన మోసానికి రైతులు సంబురాలు చేసుకోవాలా? రైతు రుణమాఫీపై కాంగ్రెస్ చెప్పిందెంత? రేవంత్‌రెడ్డి సర్కార్ ఇస్తున్నదెంత?’ అని ప్రశ్నించారు. రైతు సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నదని ఎద్దేవాచేశారు. కేసీఆర్ ఏమీ చేయలేదని.. అంతాతామే చేస్తున్నామనే భ్రమల నుంచి కాంగ్రెస్ సర్కార్ బయటకు రావాలని సూచించారు. రైతు సంక్షేమం కోసం ప్రపంచంలోనే ఏ రాజకీయ నేత చేయని కార్యక్రమాలు కేసీఆర్ చేసి చూపించారని గుర్తుచేశారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్, ధాన్యం కొనుగోళ్లు, రెండు విడుతల్లో రూ. 28,000 కోట్ల రుణమాఫీ, మిషన్ కాకతీయ వంటి అనేక పథకాలు అమలు చేసి ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాల ప్రశంసలు పొందారని గుర్తుచేశారు. దేశాన్ని 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
రైతంటే కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు.. కేసీఆర్‌కు బాధ్యత
రైతు చేతిలో పురుగు మందు డబ్బాలు, రాత్రిపూట పొలాల్లో పాముకాట్లు కేసీఆర్ పాలనలో బందయ్యాయని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు 37 లక్షల మంది ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు, లోన్ రీ షెడ్యూల్, ఆదాయపు పన్నుల పేరిట 26 లక్షల మందిని ఏరిపారేసిందని ఆరోపించారు. కేసీఆర్ రెండు విడతల్లో చేసిన రుణమాఫీతో రైతులకు ఏ స్థాయిలో మేలు జరిగిందో వివరించేందుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలను ఉదహరించారు. ఆ జిల్లాల్లో రెండుసార్లు కలిపి లక్షలోపు రుణాలున్న 5,75,177 మంది రైతులకు రూ. 2518 కోట్ల మాఫీ చేశారని గుర్తుచేశారు. ఆవే జిల్లాల్లో కాంగ్రెస్ సర్కారు ప్రస్తుతం 94,566 మంది రైతులకు రూ. 459 కోట్లు మాత్రమే రుణమాఫీ చేస్తున్నదని వివరించారు. ఈ లెక్కన ఎవరు ఎక్కువ మొత్తం మాఫీ చేశారని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు