షరతుల్లేని రుణమాఫీ, రైతుభరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల పరిధిలోని రైతులు మామిడిపల్లి చౌరస్తాలో శనివారం మహాధర్నా నిర్వహించారు.
నిజామాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు సెప్టెంబర్ 15లోపు రైతులందరికీ రూ.2లక్షలోపు రుణాలను సంపూర్ణంగా మాఫీ చేయాలని ఆర్మూర్ డివిజన్ ప్రాంత రైతులు అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే ప్రజాభవన్, సెక్రటేరియేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. షరతుల్లేని రుణమాఫీ, రైతుభరోసా అమలుకు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల పరిధిలోని రైతులు కలిసి ఆర్మూర్‌లోని మామిడిపల్లి చౌరస్తాలో శనివారం నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది. పోలీసుల ఆంక్షలను దాటుకుని వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. 44వ జాతీయ రహదారిని ఆనుకుని ఆర్మూర్‌కు వెళ్లే మెయిన్ రోడ్డులో దారిపొడవునా రైతులంతా ధర్నాలో పాల్గొనడంతో కిక్కిరిసింది. ధర్నా ప్రాంతంలో సెల్‌ఫోన్ జామర్లను ఏర్పాటు చేశారని రైతులు తీవ్రంగా మండిపడ్డారు. జామర్లను తొలగించకపోతే జాతీయ రహదారి ముట్టడిస్తామని హెచ్చరించడంతో పోలీసులు వెనక్కి తగ్గినట్టు తెలిసింది. ఆ తర్వాత సాఫీగానే కార్యక్రమం జరిగింది. రైతుల ధర్నాకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, వామపక్ష పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వేముల మాట్లాడుతూ.. ఆర్మూర్ రైతులు పోరాటాలకు పెట్టింది పేరని కొనియాడారు. నమ్మి ఓట్లేసిన రైతులకే రేవంత్‌రెడ్డి సున్నం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్‌రావులతో కలిసి సర్కారును నిలదీశామని వేముల గుర్తు చేశారు. రుణమాఫీపై రేవంత్‌రెడ్డి పూటకో మాట మాట్లాడినట్టు చెప్పారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ నియోజకవర్గాల్లోని 1,44,636 రైతులకుగాను 51,141 మంది రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయని, మిగతా 93,495 మందికి మాఫీ వర్తించలేదని లెక్కలతో వివరించారు. రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే అన్ని పోరాటాలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.
ఆంక్షలు దాటుకుని..
రైతు ధర్నాకు ఆర్మూర్ డివిజన్ రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రతినిధులు ఏసీపీని అనుమతి కోరారు.సానుకూల ప్రకటన రాగా రైతులు ధర్నాకు సిద్ధమయ్యారు. కానీ, ధర్నాకు గంటల వ్యవధి ముందు సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు రైతుల్లో కోపోద్రిక్తులను గురిచేసింది. రైతుల ఆందోళనకు రాజకీయ పార్టీల పేరును ప్రస్తావిస్తూ ప్రకటన విడుదల చేయడంపై రైతులు మండిపడ్డారు. ఆపై సీపీ కల్మేశ్వర్ వచ్చి పోలీసులతో ఆంక్షలు విధించారు. ఆర్మూర్ టౌన్‌లోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి ధర్నాప్రాంతం వరకు ఐదంచెల భద్రత, తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బైక్‌ల కు అనుమతి నిరాకరించడంతో రైతులం తా కాలినడకన అక్కడికి చేరుకున్నారు.
ఇది ఆరంభమే
రాజకీయాలకు సంబంధంలేని రైతులంతా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఆర్మూర్‌లో మొదలైన ఈ రైతు ఉద్యమం ఆరంభం మాత్రమే. ధర్నాకు ఆంక్షలుపెట్టి అడుగడుగునా అడ్డుకున్నా వేలాది మంది రైతులు తరలివచ్చారు. ఈ నిరసనతో ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పినట్లయింది.
-ఏ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆర్మూర్
రైతులకు రేవంత్ మోసం
దేశంలో రైతులను నిలువునా మోసం చేసిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డే. ఎన్నికల్లో అసత్యాలు చెప్పి, బూటకపు హామీలతో ప్రజలను రేవంత్‌రెడ్డి మోసం చేశారు. రాష్ట్రంపై కనీస అవగాహన లేకుండా పరిపాలన చేస్తున్నారు. బాసర సరస్వతీ సాక్షిగా, ఆర్మూర్ సిద్దులగుట్ట దేవుడి మీద ఒట్టేసి రుణమాఫీపై రేవంత్‌రెడ్డి మాట తప్పారు.
– బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ మాజీ చైర్మన్
సెప్టెంబర్ 15 తర్వాత ఉద్యమం తీవ్రతరం..
ఆర్మూర్ రైతులకు ఉద్యమాలు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమం, ఎర్రజొన్న బకాయిలు, పసుపుబోర్డు కోసం పోరాటం చేసిన చరిత్ర ఉంది. రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్న రేవంత్‌రెడ్డి షరతులను విధిస్తూ మోసం చేస్తుండటం చాలా బాధేస్తున్నది. రైతులంతా ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పాటై చేపట్టిన ఈ ఉద్యమానికి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. సెప్టెంబర్ 15లోపు షరతుల్లేకుండా రూ.2లక్షలోపు రుణాలను మాఫీ చేయాలని అల్టిమేటం జారీ చేస్తున్నాం. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రజాభవన్‌ను ముట్టడిస్తాం.
– ఇట్టడి లింగారెడ్డి, రైతు ఐక్యకార్యాచరణ కమిటీ
చార్ సౌ బీస్ రేవంత్‌రెడ్డి
రేవంత్‌రెడ్డి తెలిసో, తెలియకో ఆరు గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చిండు. వాటిని అమలు చేయకపోతే రేవంత్‌రెడ్డిని ఇకపై చార్ సౌ బీస్ అనాల్సి వస్తుంది. కేసీఆర్ హయాంలో 37 లక్షల బ్యాంక్ ఖాతాలకు రుణమాఫీ జరిగింది. ఇప్పుడు ఆ సంఖ్య 50 లక్షల ఖాతాలకు చేరాల్సి ఉండగా, 22 లక్షల ఖాతాలకే పరిమితమైంది. రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదు. రూ.2 లక్షల రుణం రద్దు చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం.
-ప్రభాకర్, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ
ఉద్యమ రుచి చూపిస్తం..
ఎలక్షన్ టైంల యాడికి వస్తే ఆడ లోన్లు మాఫ్ చేస్తనని దేవుళ్లపై ఒట్టు వెట్టుకున్నవ్. గిప్పుడు సీఎం అయ్యినంక మా లోన్లు మాఫ్ చేయమంటే కొర్రీలు పెట్టుడు పద్ధతి కాదు రేవంత్‌రెడ్డి. లోన్ మాఫీ అయితదని మేమంతా ఆశతోని ఉన్నం. మాట తప్పి మమ్మల్ని మోసం చేసుడు కరెక్టు కాదు. రైతులను రోడ్ల మీదకు వచ్చేటట్లు చేసినవ్. మేమంతా ఒక్కటైనం. రెండు లక్షల రూపాల లోన్లు మాఫ్ జెయ్యాలే. లేకుంటే మా ఉద్యమ రుచి చూపిస్తం.
-నర్సారెడ్డి, రైతు, ఆలూర్