సీల్డ్ కవర్లో ఉన్నా ఘోష్ కమిషన్ రిపోర్టులో ఏమున్నదో రేవంత్‌రెడ్డి, చంద్రబాబుకు డబ్బా కొట్టే కొన్ని పత్రికలు ముందే రాస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది కమిషన్ నివేదికనా లేక పీసీసీ రాసిచ్చిన రిపోర్టా? రెండేండ్లుగా కాంగ్రెస్ నేతలు, రేవంత్‌రెడ్డి ఏవైతే ఆరోపణలు చేస్తున్నరో అవే కమిషన్ రిపోర్టులో పొందుపరిచిండ్రు.
-వేముల ప్రశాంత్‌రెడ్డి
ఒక్క కేసీఆర్‌పైనే కమిషన్లు ఎందుకు వేస్తున్నరు? అంటే కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు అందరి టార్గెట్ కేసీఆరే! ఆయనను నిలువరించకపోతే తమ రాజకీయ భవిష్యత్తుకు ఎప్పటికైనా ఇబ్బందని భావించి వారంతా కలిసి కేసీఆర్‌ను వేధించాలని చూస్తున్నరు.
-వేముల ప్రశాంత్‌రెడ్డి
ఖలీల్‌వాడి, ఆగస్టు 10 : కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్.. రేవంత్, చంద్రబాబు, బీజేపీ కలిసి వండివార్చిన పొలిటికల్ కమిషన్ నివేదిక అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఒక ట్రాష్ అని, అది కోర్టుల్లో చెల్లనేరదని పేర్కొన్నారు. ఆ నివేదిక సీల్డ్ కవర్లో ఉండగానే అందులో ఏమున్నదో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ ముందే ఎలా చెప్పారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి, చంద్రబాబుకు డబ్బా కొట్టే కొన్ని పత్రికలు నివేదికలో ఏమున్నదో ముందే ఎలా రాశాయని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డను పండబెట్టి, బనకచర్ల కోసం గోదావరి నీళ్లను దోచిపెట్టి ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా ఇవ్వడం కోసమే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కాశేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగిపోతే దానిని బాగుచేసి రైతాంగానికి నీరు ఇవ్వాల్సింది పోయి, ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయిందని, అవినీతి అంటూ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ‘మేడిగడ్డ బ్యారేజీ మొన్నటికి మొన్న 5 లక్షల క్యూసెక్కుల వరదకు కూడా గట్టిగా తట్టుకుని నిటారుగా నిలబడిందని, కావాలంటే చూసొద్దాం రండి’ అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్లే ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని విమర్శించారు. కండ్ల ముందే గోదావరి నదిలో లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నా వాడుకోకుండా గుడ్లప్పగించి చూస్తున్న కాంగ్రెస్ సర్కార్‌ది కుటిల బుద్ధి అని విమర్శించారు.
అసలు తమ్మిడిహట్టి వద్ద కావాల్సినంత నీటి లభ్యత లేదని, సీడబ్ల్యూసీఆర్ఎస్ చెప్పిందన్న విషయాన్ని పదే పదే తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టకుండా మేడిగడ్డకు ఎందుకు మార్చారని ప్రశ్నించే కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. 2007లో నాటి కాంగ్రెస్ పాలకులు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయా? రాకపోతే ఎందుకు రాలేదు? ఒకవేళ అన్ని అనుమతులు ఉండి ఉంటే ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. 2007 నుంచి 2014 వరకు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో, అటు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి కదా అని నిలదీశారు.
అసెంబ్లీ ఎన్నికలైన మరుసటిరోజు నుంచే రూ.70 కోట్లతో, రూ.ఒక లక్ష కోట్లతో, రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామని పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వాటికి క్యాబినెట్ అనుమతులు ఉన్నాయా? ఫ్యూచర్ సిటీ అని ఏడాది నుంచి చెప్తున్నారు. దానికోసం ఏకంగా రూ.1,600 కోట్లతో రోడ్డు నిర్మాణానికి టెండర్ పిలిచారు. అసలు ఫ్యూచర్ సిటీకి క్యాబినెట్ అప్రూవల్ ఉన్నదా? ఉంటే ఎప్పుడు చేశారు. కేసీఆర్‌కు ఒక నీతి.. మీకో నీతి ఏల?
-వేముల ప్రశాంత్‌రెడ్డి
విచారణ కమిషన్ వాస్తవాల ఆధారంగా కాకుండా కాంగ్రెస్, బీజేపీ నేతల ఆరోపణలు, చంద్రబాబునాయుడు బాజా పత్రికల రాతల ప్రభావానికి లోనై నివేదిక ఇచ్చిందనేది స్పష్టంగా అర్థవుతుందని వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. న్యాయనిపుణులను సంప్రదించి ప్రముఖ సౌత్ ఇండియా డిజిటల్ మీడియా సంస్థ సౌత్ ఫస్ట్ ప్రచురించిన ఆర్టికల్ ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘాష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు కోర్టుల్లో చెల్లదని పేర్కొన్నారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం సెక్షన్-8బీ కింద నివేదికలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్, హరీశ్‌రావు వివరణ కోరనేలేదని తెలిపారు. అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితే ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఆగమేఘాల మీద వచ్చి రిపోర్టు ఇచ్చిందని, ఏపీలోని పోలవరం రెండుసార్లు కొట్టుకుపోతే ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు? అని వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే సుంకిశాల గోడ, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయాయని, వాటిపై విచారణకు ఇప్పటికీ ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదని నిలదీశారు. ఇది కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్కు ఉదాహరణ కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో చిన్న నష్టం జరిగితే కేసీఆర్, హరీశ్‌రావుదే బాధ్యత అంటున్నారని.. మరి పెద్దవాగుకు గండిపడినా, సుంకిశాల కూలినా, ఎస్ఎల్బీసీ టన్నెల్ మొత్తం కూలి ప్రాజెక్టు పనికిరాకుండా పోయినా, చనిపోయిన వారి ఆచూకీ ఇప్పటికీ దొరక్కపోయినా.. ఇప్పటివరకు సీఎం రేవంత్‌రెడ్డిపై, మంత్రి ఉత్తమ్‌పై కమిషన్ వేసి విచారణ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని, ఉత్తమ్‌ను ఎందుకు బాధ్యులను చేయరని నిలదీశారు. ఏపీలో పోలవరం డయా ఫ్రమ్ వాల్ రెండుసార్లు కొట్టుకుపోతే అక్కడి చంద్రబాబు, దానికి నిధులిస్తున్న ప్రధానిపై కమిషన్ వేసి ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు.
రెండేండ్లుగా కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో.. అవే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులో ఉన్నాయి. అందుకే ఇది కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి మౌత్‌టాక్ కమిషన్ రిపోర్టు. మొత్తం 665 పేజీలున్న ఘోష్ కమిషన్ నివేదికలో కేవలం 60 పేజీలతో.. అందులో కూడా వారికి అనుకూలమైన పేర్లతో బయటపెట్టి కేసీఆర్‌పై కుట్రలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ పన్నాగం పన్నుతున్నది. అందుకే అది పొలిటికల్ కమిషన్ రిపోర్టు.
-వేముల ప్రశాంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డికి ట్రిప్పుల మీద ఉన్న మోజు.. ప్రజలు, ముఖ్యంగా రైతుల తిప్పలను తీర్చడంలో లేదని వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం 51 సార్లు ఢిల్లీకి, విదేశాలకు మూడు నాలుగు సార్లు వెళ్లారని, 21 నెలల పాలనలో మూడు నెలలకు పైగా బయటే గడిపారని విమర్శించారు. హామీలు ఏమయ్యాయని అడిగితే కుట్రలు, కుతంత్రాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కమిషన్లు, విచారణలు, అరెస్టుల పేరిట అడిగే వారిని భయపెట్టాలని, ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. కుంటిసాకులతో కాలక్షేపం చేస్తున్నారే తప్ప.. రైతుల కడుపు నింపే పనులు చేయడం లేదని తెలిపారు. రుణమాఫీ నుంచి రైతుభరోసా వరకు రేవంత్‌ది అంతా మోసమేనని విమర్శించారు. చారాణా పని కూడా చేయని ఆయన.. బారాణా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో రైతు వ్యతిరేక రాజ్యం నడుస్తున్నదని వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. మాఫీలు అమలు కాలేదని, కానీ హామీల మాఫీ అమలవుతున్నదని మండిపడ్డారు. రైతు ప్రభుత్వం పోయి, రద్దుల ప్రభుత్వం, రాక్షాస ప్రభుత్వం రాజ్యమేలుతుందని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఎన్నో చెప్పారని, పాలనలో అన్నీ తప్పారని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు గాలిమాటలు చెప్పి, గద్దెనెక్కాక కూడా అవే మాటలు చెప్తున్నారని మండిపడ్డారు. వాటికితోడు గాలి మోటర్ల తిరుగుతూ ప్రజలకు ఏమీ చేయడం లేదని చెప్పారు. కేసీఆర్‌పై కక్షతో రైతుల పాలిట కల్పవృక్షంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును కూకటివేళ్లతో పెకిలించడాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముకున్నదని మండిపడ్డారు. విచారణలు ఎన్నయినా చేసుకోవాలని, కడుపులో ఉన్న విషం బయటికి వచ్చేదాకా ఏమైనా మాట్లాడుకోవాలని, కానీ తెలంగాణ ప్రజలు పొట్టలుకొట్టొద్దని హితవు పలికారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ బరాజ్ ఒక్కటే కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంపుహౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగమార్గం, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల పెర్జ్ మెయిన్స్,141 టీఎంసీల స్టోరేజీ, 530 మీటర్ల ఎత్తు లిఫ్ట్, 240 టీఎంసీల వినియోగం.. వీటన్నింటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు.
-వేముల ప్రశాంత్‌రెడ్డి
మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నిరాధార వ్యాఖ్యలు చేశారని వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా బండి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. ఫోన్ ట్యాంపింగ్లో కేటీఆర్‌కు సంబంధం లేకున్నా బండి సంజయ్ అనవసర అరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ చాలా సార్లు ఇదే విషయం చెప్పారని గుర్తుచేశారు. ఫోన్ ట్యాపింగ్ అధికారులకు సంబంధించిన అంశమని పలుమార్లు చెప్పారని తెలిపారు. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి బజార్ భాష మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పదనికి ఉన్న స్థాయి, గౌరవాన్ని బండి సంజయ్ తగ్గిస్తున్నారని విమర్శించారు. ఇలాగే అబద్ధపు మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్‌కి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.