భీమ్‌గల్, సెప్టెంబర్ 1 : కవితను కేసీఆర్‌తో కలుపడానికి ప్రయత్నం చేశానో, విడగొట్టడానికి ప్రయత్నించానో ఆమె మనస్సాక్షికి తెలుసని, ఈ విషయాలన్నీ కేసీఆర్‌కు బాగా తెలుసని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కవిత తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. నిజామాబాద్ జిల్లా లింబాద్రిగుట్టపై మీడియాతో మాట్లాడారు. పార్టీ లైన్ దాటిన తర్వాతే కేసీఆర్ కవితను సస్పెండ్ చేశారని చెప్పారు.
తాను, తన తండ్రి దివంగత వేముల సురేందర్‌రెడ్డి అప్పటి టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులమని, పార్టీ ఆవిర్భావానికి ముందునుంచే ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్‌తో మంతనాలు చేశానంటున్న కవిత.. కష్టకాలంలో కేసీఆర్ వెంట ఉన్నది ఎ వరని ప్రశ్నించా రు. అసెంబ్లీలో, బయటా రేవంత్ పై పోరాటం చే స్తున్నది తాను కాదా? అని అడిగారు. తాను కాంగ్రెస్‌లో ఎవరితోనూ మంతనాలు చేయలేదని స్పష్టంచేశారు. కవిత కాంగ్రెస్ నేతలతో మంతనాలు చేయలేదని చెప్పగలరా? అని ప్రశ్నించా రు.
పార్టీ వ్యవస్థాపక సభ్యులై ఉండి, కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు, తనలాంటి వారినే కవిత టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. కవిత సభలో కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయ మైలేజీ కోసమేనని అర్థమవుతున్నదని చెప్పారు. కేసీఆర్‌పైన ఉన్న కోపంతో కేటీఆర్, హరీశ్‌రావుపైనా విమర్శలు చేయగా లేనిది తనపై విమర్శలు చేయడం పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదని, కానీ బాధగా అనిపించిందన్నారు. కవితను రెండుసార్లు ఎమ్మెల్సీగా చేయడంలో తన పాత్ర ఏమిటో కేసీఆర్‌కు బాగా తెలుసని చెప్పారు.