హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి మోసకారి, అబద్ధాల కోరు అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తుంగతుర్తి సభలో పాత అబద్ధాలనే వల్లెవేశారని ఆరోపించారు. ‘ఎన్నికలప్పుడు ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్నారు. ఏడాదిన్నర గడిపారు. ఇప్పుడేమో రాబోయే రెండున్నరేండ్లలో లక్ష ఉద్యోగాలు ఇస్తామంటూ మాట మార్చారు. ఇది నిరుద్యోగులను మోసం చేయడం కాదా? మీరిచ్చినట్టు చెప్పుకుంటున్న 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది.. పరీక్షలు పెట్టింది.. ఎంపిక పూర్తి చేసింది మేము. మీరొచ్చి కేవలం నియామక పత్రాలు ఇచ్చి 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకోవడం అబద్ధాలకోరుతనం కాదా?’ అని ప్రశ్నించారు. నెహ్రూ కట్టిన ప్రాజెక్ట్‌లే బీళ్లు తడిపితే..
మరి కాంగ్రెస్ హయాంలో ఎస్సారెస్పీ నుంచి తుంగతుర్తి చివరి ఆయకట్టుకు నీళ్లెందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల కొత్తరేషన్‌కార్డులు ఇచ్చిందని, దీనిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. రైతులకు బాకీపడ్డ రైతుభరోసా మొత్తం డబ్బులు ఇచ్చి మాట్లాడాలని చురకలేశారు. ‘మీ పాలనలో వ్యవసాయం పండుగే అయితే, 18 నెలల్లో 700 రైతులెందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు చర్చకు రమ్మంటే ఢిల్లీకి పారిపోయిన నీకు చాలెంజ్‌లు అవసరమా.. రేవంత్‌రెడ్డీ? అని ఎద్దేవా చేశారు. రేవంత్ ఊకదంపుడు ఉపన్యాసాలకు కాలం చెల్లిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే చరమగీతం పాడతారని సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): 20 నెలల రేవంత్‌రెడ్డి పాలనలో నల్లగొండ జిల్లాకు చేసిందేమిటని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. చేసిన పనులు చెప్పలేక సీఎం రేవంత్‌రెడ్డి తిరుమలగిరి సభలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని విమర్శించారు. తుంగతుర్తి, సూర్యాపేటకు గోదావరి నీళ్లందించడంలో విఫలమైన ముఖ్యమంత్రి.. ఆరేండ్లు నిరంతరంగా నీళ్లిచ్చి రైతుల కన్నీళ్లు తుడిచిన కేసీఆర్‌పై అక్కసుతోనే ఇష్టారీతిన మాట్లాడారని సోమవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. కేసీఆర్‌ను విమర్శిస్తే గానీ పూటగడవని రేవంత్‌కు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలపై, ముఖ్యంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ పేర్కొన్నారు. మూడడుగులు ఉన్నారని జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించిన సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నడుగులు ఉన్నారని ప్రశ్నించారు. మరోసారి కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులపై అవాకులు చవాకులు పేలితే ఊరుకోబోమని, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.