హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, పదేండ్లు అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్‌ను డెకాయిట్ అనడం ఉత్తమ్ కుమార్‌రెడ్డి దిగజారుడు తనానికి నిదర్శనమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలకు సంబురపడి ఉత్తమ్ తనకు తాను ముఖ్యమంత్రిగా ఊహించుకొని రేవంత్‌రెడ్డిలా బూతులు మాట్లాడుతున్నాడా? లేక కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డిని మించి కేసీఆర్‌ను తిడితే సీఎం అవుతానని అనుకుంటున్నాడా? అని సం దేహం వ్యక్తంచేశారు. ‘ప్రజలను ఏమార్చి అధికారంలోకొచ్చి దోపిడీ పాలన చేస్తున్న మీరు డెకాయిట్లు’ అని ఉత్తమ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘ఉత్తమ్ మాటలు దొంగే దొంగ అన్నట్టు ఉన్నయ్.
సివిల్ సప్లయీస్‌లో మీరు చేసిన అవినీతిపై అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తే సమాధానం చెప్పకుండా పారిపోయిన మీరు డెకాయి ట్.. అధికారంలోకి తొమ్మిది నెలలైనా ఇంకా పాలన మీద పట్టు రాలేదు. ప్రజల సమస్యలు గాలికొదిలి అందిన కాడికి దోచుకుంటున్న మీరు డెకాయి ట్.. చివరికి గురుకులాల్లో పిల్లల నోటికాడి ముద్దను కూడా లాకొని మిం గుతున్న కాంగ్రెస్ నాయకులు డెకాయిట్లు’ అంటూ విమర్శించారు.
‘పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఇంకా కేసీఆర్ మీదపడి ఏడవటం మీ చేతకాని తనానికి నిదర్శనం’ అంటూ ఎద్దేవాచేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ కాలం వెల్లదీస్తున్న మిమ్ముల్ని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారని, కేసీఆర్‌పై మీరెన్ని మాట్లాడినా ఆకాశం మీద ఉమ్మేసినట్టేనని పేర్కొన్నారు. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఉత్తమ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.