హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అప్పులు, గురుకులాల్లో అవినీతిపై చర్చకు సవాల్ విసిరి మంత్రులు తోకముడిచారని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రుల సవాల్‌ను స్వీకరించిన బీఆర్ఎస్ పార్టీ నేతలను పోలీసులతో అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పార్టీ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.
కాంగ్రెస్ కు ధైర్యముంటే అప్పులపై అసెంబ్లీలో చర్చపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నిరంకుశ పాలన నడుస్తున్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే,ఆయన సతీమణిని ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేయడం రాజకీయ కక్షసాధింపేనని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ నేతలు అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, మంత్రులు పాలనను గాలికొదిలి అవినీతిలో మునిగిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు.