‘లెనిన్’తో ఎట్టకేలకు హిట్ ట్రాక్ ఎక్కేసింది పూణే పూబోణి భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం ‘లెనిన్’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ, మరోవైపు తమిళంలో శివకార్తికేయన్ సరసన ‘సియోన్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నది ఈ అందాలభామ. తాజాగా ఓ కళాశాల విద్యార్థులతో టాక్ షోలో ముచ్చటించిన భాగ్యశ్రీ.. తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నది. ‘నాకు నటనంటే ఇష్టం. నటిని కావడం నా గోల్.
కెరీర్ విషయంలో మన నిర్ణయాన్ని మన మనస్సాక్షి అంగీకరించినప్పుడు, ఇక ఏ విషయంలోనూ రాజీ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాజీ పడాల్సివస్తే, మనకు మనమే పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. అందుకే నా నిర్ణయాన్ని నేరుగా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. ‘వద్దు’ అనింది. నాన్నకు ఫోన్ చేస్తే ‘అమ్మ వద్దన్న పని ఎలా చేస్తావ్?’ అని ప్రశ్నించారు. అక్క అయినా మద్దతుగా నిలుస్తుందనుకుంటే.. ‘అమ్మ నాన్న వద్దంటున్నారు కదా?’ అనేసింది.
ఇలా అంతా ‘నో’ చెప్పేశారు. కానీ నేను మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆడిషన్స్‌కి వెళ్లిపోయా. దీంతో ఇంట్లో వాతావరణం వేడెక్కింది. మా అమ్మ ఆరు నెలలు నాతో మాట్లాడ్లేదు. నన్ను వాట్సాప్‌లో కూడా బ్లాక్ చేసింది. ఇప్పుడు ఈ విషయాన్ని నవ్వుతూ చెబుతున్నాను కానీ.. అప్పుడు మాత్రం చాలా బాధపడ్డా’ అంటూ తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నది భాగ్యశ్రీ బోర్సే.