హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అమరుల స్మారక చిహ్నం వద్ద కేసీఆర్ అధికారికంగా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి పసిడి విగ్రహం సీఎం, మంత్రులకు కనబడట్లేదా? అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడా అధికారికంగా ఆవిష్కరించలేదంటున్న కాంగ్రెస్ నేతలకు మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ తల్లి దీవెనలతో పసిడి తెలంగాణగా విరజిల్లాలని 2023 జూన్ 22న కేసీఆర్ అధికారికంగా ఆవిష్కరించారని గుర్తుచేశారు. హుస్సేన్‌సాగర్ తీరాన అమరుల స్మారక చిహ్నం ప్రాంగణంలో కొలువు దీరిన పసిడివర్ణ తెలంగాణతల్లి విగ్రహమే దానికి నిలువెత్తు సాక్ష్యమని స్పష్టం చేశారు.