నిజామాబాద్, ఆగస్టు 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సంస్కారం, మానవత్వం లేదు. దేవుళ్లపై ఒట్టేసి అబద్ధాలాడుతున్న మూర్ఖుడు ఆయన’ అంటూ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు.రూ.2లక్షల్లోపు రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని ఎన్నికల్లో కల్లబొల్లి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక రైతులను రేవంత్‌రెడ్డి నిలువునా ముంచారని, ఆయనపై రైతులు, ప్రజలు తిరగబడాలని, ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి వేములు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
రుణమాఫీ చేయక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2లక్షల 4వేల మందిని వంచించారని, అర్హులైన రైతుల నోట్లో మట్టికొట్టారని విమర్శించారు. కాంగ్రెస్ తీరును ఎండగడుతూ నేడు బాల్కొండ నియోజకవర్గ రైతులతో కలిసి వేల్పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద ధర్నా చేయనున్నట్టు ప్రకటించారు. రేవంత్‌రెడ్డి భాషను చూస్తుంటే అసహ్యం వేస్తున్నదని మండిపడ్డారు. వంద రోజుల్లో హామీలు అమలు చేయనందున తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైరా సభలో ప్రసంగం చూస్తుంటే మెదడు చితికి మానసిక రుగ్మతలతో రేవంత్ బాధపడుతున్నట్టు తెలుస్తున్నదని ఎద్దేవాచేశారు. రుణమాఫీ చేయకుండా ఉల్టాచోర్ కొత్వాల్‌కే డాంటే అన్నట్టుగా రేవంత్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం చెప్తున్న అబద్ధాలకు అబద్ధమే ఆత్మహత్య చేసుకుంటుందని ఎద్దేవాచేశారు. హరీశ్ సవాల్‌తోనే ఈ మాత్రం రుణమాఫీ అయినా జరిగిందని, లేదంటే ఇది కూడా అమలుకాకపోయేదని గుర్తుచేశారు.
43వేల మంది కార్మికుల జీవితాలు అగమ్యగోచరం: బాజిరెడ్డి గోవర్ధన్
ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీకి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2వేల కోట్ల బకాయిలు పడిందని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ప్రతి నెలా బకాయిలను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి తీరా నిధులు కేటాయించక పోవడంతో 43వేల మంది కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు సమయానికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని వివరించారు. మహిళలను కించపరిచారంటూ కేటీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వితంతువులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు రూ.4వేల పింఛన్ అమ లు కావడం లేదని, మహిళలకు రూ.2500 ఇవ్వడం లేదని, యువతులకు స్కూటీలు ఇస్తామని చెప్పి 8 నెలలుగా మోసం చేస్తున్న రేవంత్‌రెడ్డిని ఆడబిడ్డలంతా నిలదీయాలని పిలుపునిచ్చారు. మహిళలకు రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సుజిత్ సింగ్ ఠాకూర్, సిర్ప రాజు, రవిచంద్ర, దండు శేఖర్, సత్య ప్రకాశ్, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.