TG Assembly | హామీలు అమలు చేయడం లేదని ప్రస్తావిస్తే.. రాద్ధాంతం చేస్తూ సభను నిలిపివేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కావడం లేదని.. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా మహిళలకు రూ.2500, నిరుద్యోగులకు రూ.4000 ఇస్తామని ఇవ్వడం లేదని.. హామీలు అమలు చేయడం లేదంటూ జగదీశ్‌రెడ్డి సభలో ప్రస్తావించారన్నారు. ఈ సభ మనందరిది.. ఈ సభలో ఉన్న సభ్యులందరికీ సమాన హక్కులుండాలి.. ఇది అందరి సభ.. కాంగ్రెస్ సభ కాదంటూ మాట్లాడాలన్నారు. దీనిపై స్పీకర్‌ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నిందలు వేస్తూ.. రాద్ధాం చేస్తూ నాలుగు గంటల పాటు సభను నిలిపివేశారన్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వివరించామన్నారు.
ఆయన సూచనల మేరకు తాము నడుచుకుంటామన్నారు. తాము మాట్లాడిన దాంట్లో తప్పు లేకపోయినా స్పీకర్ ఎదుట హుందాగా విచారం వ్యక్తం చేసి సభను నడిపేలా చూడాలని సూచించారన్నారు. తప్పు చేయకున్నా స్పీకర్‌కి క్షమాపణలు చెప్పి సభను నడిచేలా చూడాలని కేసీఆర్ చెప్పారన్నారు. సీఎం ఢిల్లీలో ఉన్నారని.. సభ నడిపిస్తారా? లేదా? స్పీకర్‌ను కోరామన్నారు. సభలో జరిగిన దానిపై రికార్డులు పరిశీలించాలని.. ఒక వేళ తప్పు ఉంటే జగదీశ్వర్‌రెడ్డి విచారం చేస్తారని చెప్పామన్నారు. అయినా, దీనిపై ఇంతర వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, సభ నిర్వహించాలని కోరుతున్నామన్నారు. ఏమీ లేకున్నా ఏదో జరిగినట్లు నాలుగు గంటల సభ వాయిదా వేశారని, జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై రికార్డులను అఖిలపక్షాన్ని పిలిచి పరిశీలించాలన్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.