హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టడమంటే తెలంగాణ తల్లిని అవమానించైనా సరే.. ఢిల్లీ బాస్‌లు, సోనియా మెప్పు పొందాలనే ఆతృత రేవంత్‌రెడ్డిలో కనిపిస్తున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలైన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, తెలంగాణ అమరుల స్ఫూర్తికి ప్రతీక అయిన అమరజ్యోతి కట్టడం మధ్య లో తెలంగాణకు సంబంధమే లేని ఓ పార్టీకి చెందిన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం శోచనీయమని విచారం వ్యక్తంచేశారు. తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు వద్దన్నా వినకుండా కేవలం తన ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టరని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ తల్లిని అవమానించి అయినా సోనియా మెప్పు పొందాలని రేవంత్‌రెడ్డి ఆతృతపడుతున్నడు. అందుకే తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సచివాలయం, అమరజ్యోతి మధ్యన పెట్టిండు.
– వేముల ప్రశాంత్‌రెడ్డి
రేవంత్‌రెడ్డికి ఏనాడూ తెలంగాణ సోయి లేదని, అందుకే ఒక పార్టీ వ్యక్తి విగ్రహాన్ని సచివాలయం, అమరజ్యోతి మధ్య ఏర్పాటు చేస్తున్నారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ నేతలు సోమ భరత్‌కుమార్, చిరుమల్ల రాకేశ్‌కుమార్‌తో కలిసి తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఆత్మను తెలిపేలా సచివాలయం, అమరజ్యోతి మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ ప్రాంతాన్ని పవిత్ర భూమిగా మార్చాలనే సదాశయంతో కేసీఆర్ డిజైన్‌ను రూపొందించారని తెలిపారు.
ఈ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని 2023 జూన్, జూలైలోనే కేసీఆర్ ప్లాన్ చేశారని, ఎకరం కంటే ఎక్కువ స్థలంలో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం రెండు వైపులా ఫౌంటెయిన్లు, ప్లాజా ఏర్పాటు చేయాలని భావించారని గుర్తుచేశారు. ల్యాండ్ స్కేపింగ్, పోలీస్‌స్టేషన్, ఫుడ్ కోర్ట్స్, బస్‌స్టాప్ కట్టాలని అనుకున్నారని, డిజైన్లు కూడా సిద్ధమయ్యాక ఎన్నికల కోడ్ రావడంతో సాధ్యం కాలేదని చెప్పారు.
అమరజ్యోతిని ప్రారంభించి ఏడాది గడిచినా సందర్శకులకు అనుమతిస్తలేరు. అమరుల త్యాగాలను ప్రజలకు తెలియకుండా చేస్తున్నరు. కేసీఆర్ నిర్మించారన్న కారణంతోనే అంబేద్కర్ విగ్రహం వద్ద ఫొటో గ్యాలరీని ఎవరూ సందర్శించకుండా తాళం వేశారు.
– వేముల ప్రశాంత్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో అసువులు బాసారని, వారిని నిత్యం స్మరించుకునేలా సచివాలయం ఎదురుగా అమరజ్యోతిని మూడున్నర ఎకరాల్లో ఏర్పాటు చేశామని వేముల వివరించారు. హైదరాబాద్ వచ్చే పర్యాటకులు, విదేశీయులు, ఢిల్లీలో బాపు ఘాట్, రాజ్ ఘాట్ తరహా దీన్ని సందర్శించి నివాళులర్పించేలా రూపొందించారని చెప్పారు. 2.88 లక్షల చదరపు అడుగుల్లో ఆరు ఫ్లోర్లతో నిర్మించినట్టు తెలిపారు. అమరుల ఫొటోలు, వారి జ్ఞాపకాలు, మీటింగ్ హాల్, క్యాంటిన్ తదితరాలు ఉండేలా ప్రణాళిక చేశామని, ప్రపంచంలో ఇలాంటి నిర్మాణాలు మూడే ఉన్నాయని చెప్పారు.
ఒకటి చికాగో బీన్, రెండోది దుబాయ్ మ్యూజియం, మూడోది అమరవీరుల జ్యోతి అని, ఆ రెండింటికంటే అద్భుతంగా అమరజ్యోతిని రూపొందించామని వివరించారు. నిరంతరం వెలిగే జ్యోతిలా వారి త్యాగాలు తెలంగాణ సమాజం గుండెల్లో వెలుగుతూనే ఉండాలని ఇలా నిర్మించినట్టు చెప్పారు. దాన్ని ప్రారంభించి ఏడాది గడిచినా ఇంతవరకు సందర్శకులకు అనుమతి ఇవ్వడంలేదని, అమరుల త్యాగాలను ప్రజలకు తెలియకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల సమయంలో అమరుల కుటుంబాలను రెచ్చగొట్టి, వారిని రాజకీయంగా వాడుకున్నారని, రేవంత్‌రెడ్డి భేషజాలకు పోకుండా ఒకసారి అమరవీరుల జ్యోతిని సందర్శించాలని, సందర్శకులను అనుమతించాలని సూచించారు.
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయ్యడం సీఎం రేవంత్‌రెడ్డి తరం కాదు.. కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్‌రెడ్డి కూర్చుంటున్నడు. కేసీఆర్ చేసిన మంచిని కొనసాగించవద్దని రేవంత్‌రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నడు.
– వేముల ప్రశాంత్‌రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు కారణమైన రాజ్యాంగాన్ని రాసిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేశామని ఇది ప్రపంచంలోనే అతి పెద్దదని వేముల గుర్తుచేశారు. సందర్శకులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు అంబేద్కర్ గురించి తెలిపే అన్ని ఏర్పాట్లు చేశామని, భావితరాలు స్ఫూర్తి పొందేలా హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్‌రోడ్‌లో నెలకొల్పామని చెప్పారు. ఫొటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశామని, కేసీఆర్ నిర్మించారన్న కారణంతో దీనికి తాళం వేశారని ఆక్షేపించారు. అంబేద్కర్ జయంతి రోజున కూడా రేవంత్‌రెడ్డి అకడికెళ్లి నివాళులర్పించలేదని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, కనీసం పూలదండ కూడా వేయలేదని, ప్రజలను అనుమతించలేదని మండిపడ్డారు.
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయ్యాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని, కానీ అది సాధ్యం కాదని వేముల స్పష్టంచేశారు. కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్‌రెడ్డి కూర్చుంటున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ చేసిన మంచిని కొనసాగించవద్దని రేవంత్‌రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లి గౌరవాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. కేసీఆర్ కట్టించిన అన్నింటినీ వాడకంలోకి తేవాలని లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరుబాట తప్పదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి నియంతృత్వాన్ని, అరాచకాలను మేధావులు, బుద్ధిజీవులు ఖండించాలని కోరారు.