హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కవద్దని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వేము ల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై మాత్రమే మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రస్తావించారని పేర్కొన్నారు. ఈ సభ కాంగ్రెస్ సభ కాదని తమ సభ్యుడు మాట్లాడరని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ నిందలు వేసి, దాదాపు నాలుగు గంటల పాటు సభను నిలిపివేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే అం శాన్ని అధినేత కేసీఆర్‌కు వివరించామని, తాము తప్పు చేయకున్నా స్పీకర్‌కు క్షమాపణలు చెప్పి సభ నడిచేలా చూడాలని ఆయన ఆదేశించినట్టు తెలిపారు. రికార్డులు పరిశీలించాలని, తప్పుంటే జగదీశ్వర్‌రెడ్డి విచారం వ్యక్తం చేస్తారని చెప్పినట్టు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సభ నిర్వహించాలని స్పీకర్‌ను కోరినట్టు వెల్లడించారు. జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై రికార్డులను అఖిలపక్షాన్ని పిలిచి పరిశీలించాలని డిమాండ్ చేశారు.
సభలో సభ్యులందరికీ సమాన హక్కులుంటాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని తెలిపారు. కాంగ్రెస్ నేతలే స్పీకర్‌ను అవమానించట్టు మాట్లాడుతున్నారని, వారి మాటలు విచిత్రంగా ఉన్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చాంబర్ లేకుండా చేసినా భరించామని, పీఏసీ చైర్మన్‌ను సైతం లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు. తాము సభకు రావొద్దని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ అసెంబ్లీ చరిత్రలో చీకటిరోజుగా మిగిలిపోతుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని హత్యచేసిందని ధ్వజమెత్తారు. ప్రశ్నించేవారిని సభ నుంచి బయటకు పంపించడమేనా కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలనా? అని ప్రశ్నించారు.
ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు జగదీశ్‌రెడ్డిపై వేటేయడం ప్రజాస్వామిక విలువలకు వ్యతిరేకమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆక్షేపించారు. పాలనను గాలికొదిలిసిన కాంగ్రెస్ ప్రతిపక్షాలను ఇబ్బందిపెట్టే చీకటి అధ్యాయానికి తెరలేపిందని విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ పిరికిపంద చర్య అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. జగదీశ్ రెడ్డి సభ గౌరవాన్ని కించపర్చలేదని, రేవంత్‌రెడ్డిలా బూతులు మాట్లాడలేదని చెప్పారు. ఎక్కడా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. కేవలం ఏకవచనంతో మాట్లాడారన్న అపవాదుతో సస్పెండ్ చేయడం వెనుక మీ భయం, ఆందోళన కనబడుతున్నదని పేర్కొన్నారు. సస్పెండ్ చేసినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపదని స్పష్టంచేశారు.
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ శోచనీయమని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొనుపునూరి శ్రీకాంత్‌గౌడ్ అభిప్రాయపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ధిచెప్తారని హెచ్చరించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిందని బీఆర్ఎస్యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంలోని తప్పులను ఎత్తిచూపినందుకే ఇలాంటి దుశ్చర్యకు దిగిందని ధ్వజమెత్తారు. వెంటనే సస్పెన్షన్‌ను ఎత్తేయాలని డిమాండ్ చేశారు.