భీమ్‌గల్, జూన్ 14: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణంలో నిలిచిపోయిన వంద పడకల దవాఖాన భవనం, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు, మూతపడిన బస్ డిపోను ఆదివారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు.
అనంతరం వేముల మీడియాతో మాట్లాడారు. భీమ్‌గల్ చుట్టు పక్కల మండలాల పేదలకు మెరుగైన వైద్యం స్థానికంగానే అందాలనే సంకల్పంతో అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును ఒప్పించి రూ.35 కోట్లతో వంద పడకల దవాఖాన మంజూరు చేయించినట్టు తెలిపారు. కేవలం ఏడాదిలోనే రూ.16 కోట్లతో 75 శాతం పనులు పూర్తి చేసి కాంట్రాక్టర్‌కు రూ.13 కోట్ల బిల్లులు చెల్లించినట్టు చెప్పారు.
ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తమ పార్టీని గెలిపిస్తే మూడు నెలల్లో రూ. 5 కోట్లు తెచ్చి దవాఖానను తెరిపిస్తానని అబద్ధపు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి మాదిరిగా మహేశ్‌కుమార్ కూడా మాట తప్పారని విమర్శించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభించామని, తమ హయాంలోనే రూ. 2 కోట్లు పనులు పూర్తయ్యాయని తెలిపారు.
బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో భీమ్‌గల్ బస్‌డిపోను ఆధునీకరించి ఆరునెలలు నడిపినట్టు వేముల గుర్తుచేశారు. మూతపడిన బస్‌డిపోను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు నేటికీ ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు.