హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): మూసీ పునరుజ్జీవనం పేరిట రియల్ ఎస్టేట్ చేయాలనే సీఎం రేవంత్‌రెడ్డి ప్లాన్‌ను అడ్డుకొని తీరుతామని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో శుక్రవారం ఆయన మాట్లాడారు. మూసీ పునరుజ్జీవ పథకానికి తాము వ్యతిరేకం కాదని, అదే సమయంలో పేదల ఇండ్లు కూలగొడుతామంటే సహించేది లేదని తేల్చిచెప్పారు. సుందరీకరణ, ప్రక్షాళన, పునరుజ్జీవనం అంటూ సందర్భానికో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా, డైవర్షన్ రాజకీయాలే ప్రభుత్వ విధానంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మూసీకి ఇరువైపులా కిలోమీటర్ వరకు ఇండ్లను తొలగించి మాల్స్ నిర్మించి తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం నాటి మీడియా సమావేశంలో వెల్లడించారని మండిపడ్డారు. మూసీ పరిసర ప్రాంతాలను దుర్గంధరహితంగా మార్చాలని, గురుకులాల భవనాలకు అద్దె చెల్లించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలకు డబ్బులు లేవని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి మూసీ పునరుజ్జీవం చేసేందుకు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడంలో సీఎంకు మరెవరూ సాటిలేరని ఎద్దేవా చేశారు.