మోర్తాడ్, మే 12 : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్ విచారణ పేరిట నిందితుడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. బాలికకు డ్రగ్స్, మద్యం ఇచ్చి లైంగిక వేధింపులకు గురి చేసినట్టు ఆరోపణలు వస్తున్నా, పోలీసులు మూడు నెలలపాటు ఫిర్యాదు తీసుకోకుండా తాత్సారం చేశారని మండిపడ్డారు. పోక్సో కేసులో బాధితురాలికి రక్షణ కల్పించాల్సింది పోయి.. బాలికపైనే ఉల్టా కేసులు పెట్టడం దారుణమని ధ్వజమెత్తారు. తన కొడుకుపై వచ్చిన పోక్సో కేసుపై బండి సంజయ్ నైతిక బాధ్యత వహించాలని, భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధితురాలికి, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికకు న్యాయం జరిగేవరకూ పోరాడుతామని స్పష్టంచేశారు.
హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగాణ) : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి సాయి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించి విచారణకు సహకరించాలని చేసిన తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం జరుగాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడారు.

బండి సంజయ్ విచారణ ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని అన్నానని, కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మున్నూరుకాపు సంఘాలు విమర్శిస్తున్న క్రమంలో .. బాలికది కూడా అదే సామాజిక వర్గం అని చెప్పానని తెలిపారు. బాధితురాలికి న్యాయం చేసేందుకు పెండ్లి అనే పదం వాడానని, ప్రభుత్వం ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేది లేదని పొన్నం స్పష్టంచేశారు. బాధితురాలికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారి కుటుంబానికి పూర్తి మద్దతుగా ఉంటామని చెప్పారు.