ఖలీల్‌వాడి, అక్టోబర్ 24: విద్యుత్తు చార్జీల పెంపుతో ప్రజలపై పెనుభారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. చార్జీల పెంపు ప్రతిపాదనలు ఆశ్చర్యకరంగా, అర్థరహితంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనలపై నిజామాబాద్‌లో రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) గురువారం నిర్వహించిన బహిరంగ విచారణలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ అనేక అభ్యంతరాలు లేవనెత్తారు. వివిధ కారణాలు చెప్పి రూ.18,500 కోట్ల భారాన్ని మోపేందుకు ప్రభుత్వ విద్యుత్తు డిస్కంలు సిద్ధమయ్యాయని, వాటిని తిరస్కరించాలని ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు. ప్రజలపై భారం పడేలా ప్రభుత్వ కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. ఇండ్లకు వాడుకునే కరెంట్ నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు ప్రస్తుతమున్న రూ.10 ఫిక్స్డ్ చార్జీని రూ.50కి పెంచాలని డిస్కంలు కోరడం సరికాదని అన్నారు. విద్యుత్తు వినియోగం చాలా పెరిగిపోయిందని, ఎండాకాలంలో 300 యూనిట్ల వాడకం సాధారణమైందని తెలిపారు. చార్జీల పెంపు ప్రజలకు పెనుభారంగా మారుతుందని, మధ్యతరగతి వర్గాలపై ప్రతి నెలా వేల రూపాయల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు సంబంధించిన డిస్కంలు కూడా చేసినప్రతిపాదనలు చాలా ఆశ్చర్యంగా, అభివృద్ధి నిరోధకంగా ఉన్నాయని తెలిపారు.
చిన్న పరిశ్రమలకు, భారీ పరిశ్రమలకు ఇచ్చే కరెంట్‌కు ఒకే విధమైన రేటు కట్టడమంటే ఒకవిధంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు ఉరి వేస్తున్నట్లేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం కారణంగా రాష్ట్రం మొత్తం రోడ్డున పడే పరిస్థితి వస్తుందని, లక్షల మంది ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పరిశ్రమలు కూడా ఆగమయ్యేలా చార్జీలను పెంచాలని ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్తు భారాన్ని మధ్యతరగతి, చిన్నపరిశ్రమలు, భారీ పరిశ్రమలపై వేయాలని ఆలోచిస్తున్నదని, తద్వారా మొత్తం రాష్ట్ర అభివృద్ధి కుంటుపడే ప్రమాదముందని హెచ్చరించారు. డిస్కంలు ప్రతిపాదించిన 9 ప్రతిపాదనలను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అంధకారం అవుతుందన్న విమర్శలకు.. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చి అవన్నీ తప్పుడు ఆరోపణలని నిరూపించారని గుర్తుచేశారు. రైతాంగానికి, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేశామని, రాష్ట్రం ఏర్పడినప్పుడు 7 వేల మెగావాట్లు మాత్రమే ఉన్న విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని 24 వేల మెగావాట్లకు తీసుకెళ్లారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, బీఆర్ఎస్ నేతలు బహిరంగ విచారణకు హాజరయ్యారు.