దక్షిణ కాశీ.. రాజరాజేశ్వర క్షేత్రం
కోడె మొక్కులు ఇక్కడే ప్రత్యేకం
క్రీ.శ. 1083లో గుడి నిర్మాణం
బతుకమ్మ పండుగకు మూలం
కరీంనగర్, మార్చి 28 : తెలంగాణ ప్రాంతంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం దక్షిణకాశిగా భాసిల్లుతున్నది. కోరిన కోర్కెలు తీర్చే ప్రధాన శైవక్షేత్రంగా విలసిల్లుతున్నది. తెలంగాణ జిల్లాల నుండే కాకుండా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి రాజన్నను దర్శించుకునేందుకు నిత్యం భక్తుల వేలాదిగా తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏ శైవక్షేత్రాల్లోనూ లేని ఆచారాలు ఈ క్షేత్రంలో కొనసాగడం మరోవిశేషం. రాజరాజేశ్వరస్వామివారికి కోడెను కట్టివేయడం ఇక్కడి ప్రధాన పూజగా అలనాటి నుంచి కొనసాగుతున్నది. ఇంకే ఇతర శైవక్షేత్రాల్లోనూ ఈ కోడెమొక్కు కనిపించదు. మంగళకరుడైన పరమశివుడు చేస్తున్న మంచి పనుల్ని చూసి సంతోషించిన ధర్మదేవత శివుడి దగ్గరికి వచ్చి ‘వాహనంతే భవిష్యామి’ నేను నీకు వాహనమవుతానని కోరుకుందని, శివుడు అందుకు అంగీకరించి నందిలా నా ముందుండమని అన్నాడనేది స్థలపురాణం. అందుకే భక్తులు ‘నందికేశ మహాభాగ శివధ్యాన పారాయణ, మహాదేవస్య పూజార్థం దర్శనం దాతు మర్హసి’ అంటూ ముందుగా నందీశ్వరున్ని పూజించి ఆ తర్వాత శివున్ని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది. ‘నందయతి ఇతి నంది’.. సృష్టికి సంతోషాన్ని కలిగించేది నందిరూపంలో ఉన్న ధర్మదేవతే అన్నది భక్తుల విశ్వాసం. కష్టనష్టాల్లోంచి బయటపడితే, కోర్కెలు తీరితే, ముందు గా మొక్కుకున్నట్టు భక్తులు రాజరాజేశ్వరుడికి కోడెలను సమర్పించుకుంటారు. భక్తులు దానిని చేతిలో పట్టుకుని, కుటుంబంతో కలిసి, గుడిచుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణ చేసి, ఆవరణలో కట్టేసి, రాజన్న దర్శనం చేసుకుంటారు.
మత సామరస్యానికి ప్రతీక
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో మరొక అత్యంత ఆశ్చర్యకరమైన విశేషమేమిటంటే ఇక్కడి రాజన్న ఆలయ ప్రాంగణంలోనే ముస్లిం సోదరుల ఆరాధ్య సమాధి నెలవై ఉండడం. ఇక్కడి దేవాలయ ప్రాంగణంలో హజ్త్ సయ్యద్ ఖ్వాజా సమాధి ఉండడంతో ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది.
ఎములాడగానే ప్రసిద్ధి
వేములవాడకు పాతకాలంలో – లేంబులవాటిక, లేములవాడ/లెములవాడ, లెములాడ/యెములాడ, వేంబులవాడ, యెముడాల, వేల్పులవాడ !! అని పేర్లున్నాయి. లేంబులు అంటే.. లేగదూడలని అర్థం. ఇక్కడ లేగదూడలు ఎక్కువగా ఉండేవట.. లెములు లేదా వేములు అంటే అందమైన వనితలు ఎక్కువగా ఉన్న ప్రాంతమని అర్థం. దాదాపు తెలుగువారిని ప్రభావితం చేసిన అన్ని సంప్రదాయాలకు ఇది నెలవుగా ఉన్నది. మనం కొలిచే ముఖ్యదేవతలంతా ఇక్కడ ఉండటం వల్ల దీనికి వేల్పుల వాడ అని పేరు కూడా వచ్చింది. అంతేకాకుండా దీనికి దక్షిణకాశి, మహాక్షేత్రము, హరిహర క్షేత్రము, భాస్కర క్షేత్రము, కుబేర క్షేత్రము, రాజరాజేశ్వర క్షేత్రము, భీమేశ్వర రాజరాజేశ్వర క్షేత్రము, ఆది పండరీపురము, బృహత్ క్షేత్రము, బృహదీశ్వర క్షేత్రము.. అన్న పౌరాణిక ప్రశస్తి ఉన్నది. వేదవిద్యలకు విద్వాంసులకు అనువైన క్షేత్రం కావడంతో వేదాల వాడ అన్న పేరు కూడా వచ్చింది. తెలుగునాట ఏడో శతాబ్దం నుంచి పదో శతాబ్దం వరకు ఏలిన చాళుక్యులకు వేములవాడ రాజధానిగా ఉన్నది. 9 వ శతాబ్దంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. 1083వ సంవత్సరంలో ఆలయ నిర్మాణం జరిగింది. చాళుక్యుల తరువాత ఎవరూ కూడా ఈ ఆలయంలో ఎలాంటి కట్టడాలు కట్టలేదు.
బతుకమ్మ పండుగకు మూల స్థావరం
ఈ ఆలయం బతుకమ్మ పండుగకు మూల స్థావరంగా కూడా ప్రసిద్ధి చెందింది. రాజేంద్రచోళుడు పశ్చిమ చాళుక్యులపై విజయానికి సంకేతంగా వేములవాడ ఆలయాన్ని కొల్లగొట్టి.. రాజరాజేశ్వర లింగమును (బృహదీశ్వర లింగమును) తరలించుకొని పోయాడట. శివసాంగత్యం లేని అమ్మవారిని ఊరడించడానికి, చోళులకు నిరసన తెల్పడానికి పూల రూపంలో మేరు పర్వతాన్ని పేర్చి, శ్రీచక్రాన్ని పేర్చి ఒక ఉద్యమం లాగా ఈ పండుగ ప్రారంభమైందన్న కథనం ప్రజల్లో ప్రచారంలో ఉన్నది. 840-880 సంవత్సరాల మధ్యలో నిర్మించిన భీమేశ్వర దేవాలయం వేములవాడ ప్రధాన దేవాలయానికి అనుబంధంగా ఉంటుంది. ఇందులోని శివలింగం తంజావూరు బృహదీశ్వర లింగం లాగానే ఉంటుంది. ఇప్పటికీ బతుకమ్మ కథల్లో చోళరాజు కథ ప్రధానంగా ఉంటుంది.
కొండగట్టు ఆలయమూ అభివృద్ధి
వేములవాడతోపాటు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ప్రస్తుత జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఈ దేవాలయం ఉన్నది. గొప్ప ప్రకృతి సౌందర్యం కలిగిన ఈ గుడిలో.. జానపదగాధల ప్రకారం 40 రోజులు పూజలు చేస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. దాదాపు రెండు వందల ఏండ్లనాటి చరిత్ర ఈ ఆలయానికి ఇక్కడ ఆంజనేయుడు శంఖుచక్రగదాలంకరణతో పంచముఖాలలో ఒకటైన నారసింహ రూపం ఉత్తరాభిముఖంగా.. ఆంజనేయరూపం మరోవైపుగా వెలిశాడు.