హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : తనను సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతానని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ మేరకు సోమవారం రాజాసింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు పార్టీ నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నట్టు ప్రచారం సాగుతున్నదని.. నోటీసులు కాదు.. కావాలంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందనేది ప్రజల ముందుంచి తాను బయటకు వెళ్తానని.. సొంత పార్టీ నేతలను ఆయన హెచ్చరించారు. బీజేపీలో రాష్ట్ర నాయకత్వం వర్సెస్ రాజాసింగ్ వివాదం మరింత ముదురుతున్న వేళ.. ఆయన తాజా ప్రకటన కాషాయపార్టీలో మరోసారి కలకలం రేపింది.