Hyderabad | హైదరాబాద్-విజయవాడ మార్గంలో రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వరద పోటెత్తడంతో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా నందిగామ మండలంలో మున్నేరు వాగుకు వరద తగ్గడంతో అధికారులు వాహనాల రాకపోకలకు అనుమతించారు. ఐతవరంలో నిలిచిన వాహనాలను పోలీసులు దగ్గరుండి పంపించివేస్తున్నారు. 65వ నెంబర్ జాతీయ రహదారిపై దాదాపు 30 గంటల తర్వాత వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద కొత్త వంతెనపై నుంచి వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.
వాహనాలను వంతెనపై నుంచి నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో సూర్యాపేట, ఖమ్మం వైపు రెండుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 30 గంటల పాటు తెలుగు రాష్ట్రాల మధ్య ఆయా మార్గాల్లో సంబంధాలు కట్టయ్యాయి. దాంతో ఆర్టీసీ బస్సులు, కార్లు, లారీలు నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల మధ్య 1400కుపైగా ఆర్టీసీ బస్సులు రదయ్యాయి. ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ మార్గాల్లో వెళ్లే బస్సులను రద్దు చేశారు. పలు వాహనాలను హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే బస్సులను గుంటూరు మీదుగా మళ్లించారు.