హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కూరగాయల (Vegetables) పంటల దిగుబడులు తగ్గడంతో ఇతర రాష్ర్టాల నుంచి మార్కెట్లోకి పెద్దఎత్తున దిగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలో దాదాపు 68% కూరగాయలు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఏపీ నుంచి వస్తున్నట్టు మార్కెటింగ్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి కూరగాయలు దిగుమతి కావడంతో రవాణా చార్జీలు కలుపుకుని ధరలు అధికంగా ఉంటున్నాయని వెల్లడిస్తున్నారు. కర్ణాటక నుంచి టమాటా, పచ్చిమిర్చి, చిక్కుడు, కాలిఫ్లవర్, మహారాష్ట్ర నుంచి క్యారట్, ఉల్లిగడ్డ, గుజరాత్ నుంచి ఆలుగడ్డ, ఏపీ నుంచి అరటి, ముల్లంగి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి బెండ, దొండ, గోరు చిక్కుడు, వంకాయ వంటి కూరగాయలు దిగుమతి అవుతున్నట్టు వ్యాపారులు తెలుపుతున్నారు.
రాష్ట్రంలో సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో సాగుచేసిన కూరగాయ తోటల నుంచి నవంబర్ నాటికి పెద్దఎత్తున దిగుబడి రావాలి. కానీ జూలైలో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో ఆగస్టులో పూర్తిస్థాయిలో పంటలు వేయలేకపోయారు. సెప్టెంబర్ నుంచి సాగుచేసిన కూరగాయ తోటలు అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. టమాటా చెట్లకు వచ్చిన పూత, కాత చాలా వరకూ నెలరాలిపోయింది. దీంతో రాష్ట్రంలో టమాటా కొరత ఏర్పడి.. ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవడంతో మార్కెట్లలో సుమారు రూ. 60 వరకు ధర పలుకుతున్నది. కాగా, పెరిగిన కూరగాయల ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్లలో ఏ కూరగాయల ధర చూసినా కిలోకు సుమారు రూ. 60పైమాటే ఉండటంతో ఆందోళ:న వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కాలంవెళ్లదీసే తమకు ఇప్పుడు పెరిగిన కూరగాయల ధరలతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రెండు నెలల్లో మార్కెట్లోకి కొత్త పంటలు
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో కూరగాయల తోటలు దెబ్బతిన్నందున ప్రస్తుతం కొరత ఏర్పడిందని ఉద్యానశాఖ అధికారులు వెల్లడించారు. అధిక వర్షాల వల్ల పంటలు కోల్పోయిన రైతులు తిరిగి ఇప్పుడు మళ్లీ పంటలు వేస్తున్నారని తెలిపారు. మరో రెండు నెలల్లో పంటలు కోతకు వస్తాయని పేర్కొన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో కొందరు రైతులు హరిత పందిళ్లు వేసి హైబ్రీడ్ రకాల వంగడాల సాగుతో అధిక దిగుబడులు సాధిస్తున్నారని, ఆ పంటలే ప్రస్తుతం మార్కెట్లలోకి వస్తున్నాయని అందువల్ల ధరలు ఎక్కువగా ఉంటున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం రైతు మార్కెట్లలో ఉన్న కూరగాయల ధరలు
కూరగాయలు ధర (కిలో)
టమాటా రూ.60
పచ్చిమిర్చి రూ.60
క్యారట్ రూ.80
బీన్స్ రూ.80
మునగకాయలు రూ.20(రెండు)
వంకాయ రూ.60
బెండకాయ రూ.60
దొండకాయ రూ.60
కాలిఫ్లవర్ రూ.40 (ఒకటి)
క్యాబేజీ రూ.40 (ఒకటి)
దోసకాయ రూ.60