హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): మార్కెట్ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వాటిని కొనాలంటేనే సామాన్యుడు హడలెత్తిపోతున్నాడు. నిన్నమొన్నటి వరకు కాస్త పరవాలేదు అనుకున్న ఉల్లి ధర కూడా ఇప్పడు ఘాటెకింది. రిటైల్ మార్కెట్లో కేజీ ఉల్లి ధర రూ.40 నుంచి రూ.45 వరకు పలుకుతున్నది. మహారాష్ట్ర మార్కెట్ నుంచి దిగుమతులు తగ్గడమే ధర పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు తెలిపారు. తెలంగాణలోని మలక్‌పేట్, ఏపీలోని తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్‌కు దేశవ్యాప్తంగా ఫేమస్. ఈ మార్కెట్లకు షోలాపూర్, నాసిక్, ఫుణె, అహ్మద్‌నగర్ ప్రాంతాల నుంచి నిత్యం కనీసం 450 టన్నుల వరకు ఉల్లి దిగుమతి అవుతుంది. ఇకడి నుంచి వివిధ ప్రాంతాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు మారెట్లకు తరలుతుంది. ఈ మారెట్‌కు ప్రస్తుతం రోజుకు 240 టన్నుల ఉల్లి మాత్రమే వస్తుండటం వల్ల వారంరోజులుగా ఉల్లి ధరల్లో మార్పులు వచ్చాయి. వారం క్రితం రిటైల్ మార్కెట్లో కేజీ రూ.20 నుంచి రూ.30 వరకు పలికిన కేజీ ఉల్లి.. ఇప్పుడు రూ.50 నుంచి రూ.60కి చేరాయి. వారం క్రితం నాసి రకం ఉల్లి రూ.100కు మూడు కిలోలు విక్రయిస్తుండగా.. ప్రస్తుతం దుకాణాల వద్ద నాణ్యత తక్కువగా ఉన్న వాటిని కిలో రూ.40 నుంచి రూ.45 వరకు అమ్ముతున్నారు. పైగా త్వరలో బక్రీద్ పండగ ఉండటంతో డిమాండ్ అంతకంత పెరుగుతుంది. డిమాండ్, సరఫరా మధ్య అంతరం ఏర్పడటం వల్ల ధరలు పెరిగాయని మార్కెట్ ట్రేడర్లు చెప్పారు.
కూరగాయల ధరలు పెరుగుదలపై ఎర్రగడ్డ రైతు బజార్ ఈవో రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షాకాలంలో కొత్త పంట వేయడంతో.. ఆ తేడా కూరగాయల ధరల్లో కనిపిస్తున్నదని తెలిపారు. ప్రతి కూరగాయలోనూ 10 రూపాయల పెరుగుదల కనిపిస్తున్నట్టు పేర్కొన్నారు. వివిధ జిల్లాల్లో రాష్ట్రాల నుంచి దిగుబడి తకువగా ఉండటంతో కూడా కూరగాయల ధరలు పెరిగాయని, ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కూడా పెరిగిపోవడంతో ఆ భారం కూడా కూరగాయల రేట్లపై పడిందని వెల్లడించారు. పెరిగిన ధరలు నెలరోజులపాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు ఈవో చెప్పారు.