ఖమ్మం, ఫిబ్రవరి 9: ఖమ్మం నగరవాసుల సౌకర్యార్థం రూ.8 కోట్లతో ఖమ్మం నడిబొడ్డున వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మించినట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన నగరంలోని వీడీవోస్ కాలనీలో నిర్మించిన సమీకృత మార్కెట్‌ను సందర్శించారు. మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్న మహిళా రైతులతో మాట్లాడారు. ఎవరెవరు ఏయే రకాల కూరగాయలు విక్రయిస్తున్నారు? ఖర్చులు పోను రోజుకు ఎంత మిగులుతున్నది? కొత్త మార్కెట్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అని ఆరా తీశారు.
అనంతరం మంత్రి స్వయంగా కూరగాయలు కొనుగోలు చేశారు. చేపలను తూకం వేశారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గజ్వేల్ తర్వాత ఖమ్మంలోనే అతిపెద్ద మార్కెట్ ఏర్పాటైందన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ మార్కెట్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.