Osmania University | ఓయూలో మరో వివాదం.. అతిథులపై నిషేధం!
ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు జారీ చేసిన మరో సర్క్యులర్‌పై వివాదం రాజుకుంటున్నది. ఓయూలో అన్ని రకాల ఆందోళనలను నిషేధిస్తూ 15 రోజుల క్రితం జారీ చేసిన సర్క్యులర్‌పై విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.
- అనుమతి లేకుండా సదస్సులకు ఎవరినీ పిలవొద్దని వీసీ సర్క్యులర్
- పోస్టర్ రూపొందించే ముందే అనుమతి తీసుకోవాలని హుకుం
- వీసీ వైఖరిపై గవర్నర్‌కు ఔటా లేఖ
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 30: ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు జారీ చేసిన మరో సర్క్యులర్‌పై వివాదం రాజుకుంటున్నది. ఓయూలో అన్ని రకాల ఆందోళనలను నిషేధిస్తూ 15 రోజుల క్రితం జారీ చేసిన సర్క్యులర్‌పై విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. అంతలోనే మరో సర్క్యులర్ రగడకు దారితీసింది. విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలలు, విభాగాల్లో సదస్సులు, వర్క్‌షాప్‌లు, అతిథి ఉపన్యాసాలు నిర్వహిస్తుంటారు. ఆయా సదస్సుల ప్రారంభోత్సవం, ముగింపు కార్యక్రమాలకు వర్సిటీ అధికారులను అతిథులుగా ఆహ్వానించడం ఆనవాయితీ. అయితే, ఆయా కార్యక్రమాల పోస్టర్లపై అనుమతి లేకుండానే పేర్లు ముద్రించవద్దని, ముందుగా తమ అనుమతి తీసుకోవాలని తాజా సర్క్యులర్‌లో ఆదేశించారు.
సదస్సు ప్రారంభోత్సవం, ముగింపు కార్యక్రమాలు గరిష్ఠంగా 45 నిమిషాలు మాత్రమే ఉండాలని నిర్దేశించారు. వేదికపైకి ఎక్కువ మంది అతిథులను ఆహ్వానించడం సరికాదని పేర్కొన్నారు. సదస్సుకు సంబంధించిన ప్రెస్‌నోట్‌ను కేవలం పీఆర్వో ద్వారా మాత్రమే విడుదల చేయాలని, ఒక కాపీని ఐక్యూ ఏసీ విభాగానికి పంపించాలని సూచించారు. ప్రతి కార్యక్రమానికి సంబంధించి ఒక పేజీ వివరణ, జియోట్యాగ్‌తో కూడిన ఫొటోలు తప్పనిసరి అని పేర్కొన్నారు. అతిథులు, ఆహ్వానితుల వివరాలు, సమయం, వేదిక ముందుగానే తమకు తెలియజేయాలని ఆదేశించారు.
గవర్నర్‌కు ఔటా ఫిర్యాదు
ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అభ్యంతరం వ్యక్తంచేసింది. వీసీ నిర్ణయాలతో యూనివర్సిటీ ప్రతిష్ఠ దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ బీ మనోహర్ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేశారు. వర్సిటీ అధ్యాపకులను వీసీ తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. వర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై చాన్స్‌లర్‌గా జోక్యం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే గవర్నర్‌కు లేఖ రాసిన ఔటా ప్రతినిధులు రెండు మూడు రోజుల్లో ఆయనను నేరుగా కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.
లేఖలోని ముఖ్యాంశాలు
- ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ రమేశ్‌బాబు పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. దాంతో ఆయన తనను రిలీవ్ చేయాల్సిందిగా వీసీని కోరారు. వారం గడిచినా ప్రొఫెసర్ రమేశ్‌బాబును వీసీ రిలీవ్ చేయకుండా నాన్చుతున్నారు. ఇది పూర్తిగా యూనివర్సిటీ నిబంధనలను ఉల్లంఘించడమే. ఈ విషయమై ఔటా ప్రతినిధులు వీసీని కలిసేందుకు ప్రయత్నించగా ఆయన తిరస్కరించారు. గతంలో ఇలాంటి పదవుల్లో నియమితులైన పలువురు అధ్యాపకులు వర్సిటీ నుంచి రిలీవ్ అయ్యారు.
- వీసీ తన కార్యాలయంలో కార్యాలయ పనివేళల్లో అందుబాటులో ఉండటం లేదు. దీంతో అత్యవసర విద్య, పరిపాలన అంశాల్లో నిర్ణయం తీసుకునేందుకు అధ్యాపకులకు ఇబ్బందికరంగా మారింది.
- యూనివర్సిటీలో అధ్యాపకులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో వీసీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కనీసం సమస్యలు వినేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఈ వైఖరి సమస్యలను తీవ్రతరం చేస్తున్నది.
- వర్సిటీ నియమ, నిబంధనలపై వీసీకి సరైన అవగాహన లేదు. వర్సిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఆసక్తి చూపడం లేదు. యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలను నిషేధిస్తూ జారీచేసిన సర్క్యులర్ క్యాంపస్‌లో గందరగోళానికి దారితీసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

