Ponguleti Srinivas Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో/మణికొండ, మార్చి 20: వట్టినాగులపల్లి భూ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనయుడి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై పోలీసు కేసు నమోదు కావడం, అనంతరం ఇన్స్పెక్టర్ బదిలీ కావడం తెలిసిందే. సరిగ్గా అదే భూ వివాదం ఇప్పుడు మరోసారి రాజుకున్నట్టు కనిపిస్తున్నది. కాకపోతే గతంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ తెరపై కనిపించగా ఇప్పుడు న్యూజెన్ బిల్డర్స్ పేరు వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని సర్వేనంబర్ 245లో సతీశ్షాకు చెందిన 20.14 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని ఆయన తన కుమార్తెలు పల్లవిషా, ప్రియాంకషా, రాధికాషాకు ఇచ్చారు. ఈ భూమిని ఆనుకొని సర్వే నంబర్ 258, 259లో భూములున్నాయి. ఇవి అవినవ్షా, అక్షయ్షా పేరిట ఉండగా వీరి భూముల్లోంచే ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం కావడంతో కొంత భూమి కోల్పోయారు. ప్రస్తుతం ఔటర్‌ను ఆనుకొని ఈ రెండు సర్వేనంబర్లలో 9.10 ఎకరాల భూమి ఉన్నది.
దీన్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్ కింద తీసుకున్నది. యజమానుల సమ్మతితో అగ్రిమెంట్లు చేసుకున్నది. ఈ భూమి వెనుకాలే ఉన్న సతీశ్షాకు చెందిన 20.14 ఎకరాలను కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద తీసుకుంటే భారీ నిర్మాణం చేపట్టవచ్చని ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు సతీష్షాను అడిగితే డెవలప్మెంట్కు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఎలాగైనా ఆ భూముల్ని కూడా తీసుకోవాలని కొన్ని నెలలుగా మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు ప్రయత్నాలు చేశారు. అవి విఫలం కావడంతో గత డిసెంబర్ మొదటి వారంలో మంత్రి కుమారుడు, ఇతరులు అక్కడికి వచ్చి దాదాపు 70 మంది వరకు బౌన్సర్లను పురమాయించారు. వారంతా అక్కడ ఉన్న సెక్యూరిటీని కొట్టి జేసీబీలతో ప్రహరీ, గోశాలను కూల్చివేశారు.
కిషన్షా నేరుగా పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టడంతో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి బౌన్సర్లను తమ ైస్టెల్లో మందలించడం తదుపరి చోటుచేసుకున్న పరిణామాలను ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తె చ్చింది. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల స్థాయి లో దుమారం రేగి చివరికి చట్టబద్ధంగా పని చేసిన ఇన్స్పెక్టర్ను అక్కడి నుంచి బదిలీ చేశారు. ఏకంగా మంత్రి కుమారుడు కావడంతో బాధితులు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించి పోలీసుల సెక్యూరిటీ పొందారు. దీంతో వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. కానీ ఎలాగైనా సతీష్షా కుటుంబానికి చెందిన భూమిని పొందాలనే పంతం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నదని తాజా ఘటనతో తేటతెల్లమైంది.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్ 245లో 20.14 ఎకరాల భూమి వివరాలు వెల్లడిస్తున్న అవినవ్ షా, అక్షయ్ షా
సతీష్షా కుటుంబానికి చెందిన వాళ్లు తాము హైకోర్టు ఆదేశానుసారమే ప్రహరీకి మరమ్మతులు చేసుకుంటున్నట్టు చెప్తున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం న్యూజెన్ బిల్డర్స్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి పోలీసుల సమక్షంలోనే ప్రహరీ కూల్చివేయడం గమనార్హం. న్యాయస్థానం ఆదేశాలతోనే తాము నిర్మించుకుంటున్నామని భూ యజమానులు చెప్తున్నా వినకుండా పట్టాదారులను బెదిరించి ప్రహరీ కూల్చివేశారు. సదరు వ్యక్తులు ముఖం కనిపించకుండా ముసుగుతో ఉన్నారని పక్కాప్లాన్‌తో బెదిరింపులకు పాల్పడేందుకే అక్కడికి వచ్చారని స్పష్టమవుతున్నది. అయితే దాదాపు 30 సార్లు డయల్ 100కు ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదని బాధితురాలు వాపోయారు. దాదాపు గంట తర్వాత తీరిగ్గా అక్కడికి వచ్చిన గచ్చిబౌలి పోలీసులు తమను కూడా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తంచేశారు. సదరు భూమి వద్ద శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున అందరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లామని పోలీసులు తెలిపారు. ఏదైనా ఉంటే న్యాయస్థానంలో తేల్చుకోవాలని మందలించి పంపించినట్టు చెప్పారు.
ఈ రోజు నేను నా పొలంలోకి వచ్చి చూడగా అర కిలోమీటర్ మేర నిర్మించిన ప్రహరీని కూల్చివేసిండ్రు. నేను 100 నంబర్‌కు కనీసం 30సార్లు ఫోన్ చేస్తే ఇద్దరు పోలీసులు గంట వరకు వచ్చిండ్రు. ముఖాలకు నల్లటి ముసుగులు ధరించి వచ్చిన దుండగులను నిలువరించేందుకు ప్రయత్నించినం. న్యూజెన్ బిల్డర్స్, రాఘవ బిల్డర్స్ యజమాని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అతడి కుమారుడు హర్ష ఆదేశాలతోనే మా ప్రహరీ రెండోసారి కూల్చివేశారు. అప్పట్లో మంత్రి కుమారుడిపై పోలీసు అధికారి కేసు నమోదు చేస్తే వారిపై బదిలీ వేటు వేశారు.
ఇప్పుడు రెండో సారి మా ప్రహరీ కూల్చివేసిండ్రు. కోర్టు ఆదేశాలతో మాకు రక్షణగా ఉంటున్నట్టు నటిస్తున్న పోలీసులు ఇక్కడ దావత్‌లు చేసుకుంటూ బిల్డర్లు, గూండాలకు రక్షణ కల్పించడం బాధాకరం. కోర్టు ఆదేశాలున్నా మాకు ఎలాంటి రక్షణ కల్పించడం లేదు. ‘మీరు ఉండగా దుండగులు మా ప్రహరీ ఎలా కూల్చివేశారు’ అని నేను అక్కడున్న పోలీసులను ప్రశ్నిస్తే, మీరు ప్రహరీ ఎందుకు కట్టారని ఉల్టా మమ్మల్నే బెదిరిస్తూ బిల్డర్లకు వత్తాసు పలికిండ్రు. మాకు కోర్టు ఆర్డర్ ఉన్నందుననే మేము మా స్థలంలో ప్రహరీ నిర్మించినం. కోర్టు నుంచి ఎంట్రీ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా, పోలీసు ప్రొటెక్షన్ కల్పించాలని న్యాయస్థానం చెప్పినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. పోలీసులు ప్రత్యర్థులకు పూర్తిగా అమ్ముడు పోయిండ్రు. మాకు రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశిస్తే పోలీసులు అందుకు భిన్నంగా ప్రత్యర్థులకు రక్షణ కల్పిస్తున్నరు. దీనిపై నేను న్యాయ పోరాటం చేస్తా. బిల్డర్లకు రక్షణ కల్పిస్తూ ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులపైనా చర్యలు తీసుకునేలా న్యాయపోరాటం చేస్తా.
-బాధితురాలు పల్లవి షా హైకోర్టు చెప్పినా రక్షణ లేదు
న్యాయస్థానం ఆదేశించినా మాకు రక్షణ లేకుండా పోయింది. గత రాత్రి అవినాష్‌తో పాటు మరో వ్యక్తి మా భూమిలోకి వచ్చారు. పోలీసుల సాక్షిగానే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మా భూమిలోకి చొరబడటమే కాకుండా మా ప్రహరీని కూల్చివేశారు. వారి స్థలం మా భూమిలో ఉన్నదని కోర్టుకు వెళ్లగా వారి పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. వాళ్ల భూమి తక్కువ ఉన్నదని మా భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నరు. హైకోర్టు చేయించిన సర్వే ప్రకారం మా భూమి ఉన్నా కబ్జాదారులు తరచూ మాపై దౌర్జన్యానికి దిగుతున్నరు.
-సతీష్షా