యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నందివనపర్తిలో (Nandiwanaparthy) గ్రామీణ విద్యార్థుల వికాసం కోసం జ్ఞానసరస్వతీ దేవాలయం నిర్మితమైంది. ఆయలం పూర్తిగా విద్యార్థుల భాగస్వామ్యంతోనే నిర్మించడం విశేషం. జిల్లాలోనే సరస్వతీ మందిరాలు అరుదు కావటంతో ఈ ఆలయం అనతి కాలంలోనే అత్యంత ఆదరణకు నోచుకుంది. చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజు పర్వదినంను పురస్కరించుకొని ప్రతి ఏడాది వసంతపంచమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దీనికోసం ఇప్పట్టికే ఆలయాన్ని అత్యంత సుందరంగా ముస్తాబుచేశారు. హంపీ పిఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామీజీ ఆలయంలో ప్రత్యేకపూజలు, అర్చనలు, సరస్వతీ హోమం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించనున్నారు. దీనికోసం బాసరా వెళ్లలేని భక్తులంత నందివనపర్తిలో అక్షరాబ్యాసం చేయించి, ప్రత్యేకపూజలు చేసి, మొక్కులు తీర్చుకుంటారు. మొత్తంగా నందివనపర్తి జ్ఞాన సరస్వతి ఆలయ పరిసరాలు చదువుల తల్లికి జై అంటూ సరస్వతి నామ స్మరణతో మారుమ్రోగనుంది.
దేవాలయాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన నందివనపర్తిలో సకల దేవతలు కొలువుదీరారు. గ్రామంలో ఎంతో ప్రతిష్ట కలిగిన ఓంకారేశ్వరాలయం, పురాతన శివాలయం, నందీశ్వారాలయం, చెన్నకేశవాలయం, రామాలయం, హనుమాన్ దేవాలయం గ్రామదేవతల ఆలయాలు కొలువుదీరాయి. అన్ని దేవతలున్న గ్రామంలో సరస్వతీమాతను ప్రతిష్టించాలని గ్రామానికి చెందిన సదా వెంకట్రెడ్డి సంకల్పించాడు. జ్ఞానసరస్వతీ సేవాసమితిని ఏర్పాటు చేసుకుని, కమిటీ సభ్యులతో 2008లో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సేవాసమితి వ్యవస్థాపకులు సదా వెంకట్రెడ్డి ఆలయ నిర్మాణాన్ని భుజస్కందాలపై వేసుకుని, ప్రణాళికను రూపొందించారు. చదువుల తల్లి విగ్రహ ప్రతిష్టను, ఆలయ నిర్మాణాన్ని కేవలం విద్యార్థుల సహాయ సహకారాలతోనే నిర్మించాలని సంకల్పించారు. పైగా, చుట్టుపక్కల ప్రాంతాల్లో సరస్వతీ ఆలయాలు లేకపోవటంతో పేద విద్యార్థులు బాసర వెళ్లి, చదువుల తల్లిని దర్శించుకునే భాగ్యం లేకుండాపోయింది. వారి బాధలకు స్వస్తీ చెబుతూ, అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం మరింత పట్టు బిగించి నిర్మాణం పూర్తి చేశారు. ఇటివల సంకల్ప భవనంను సైతం పూర్తి చేశారు. ఆలయాన్ని మరింత అభివృద్ది చేయాలని ఆయన తపన.
ఆలయ నిర్మాణం విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మించతలపెట్టిన జ్ఞానసరస్వతీ సేవా సమితి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని పాఠశాలలతో పాటుగా పక్క మండలాల్లోని పాఠశాలల్లో గల్లపెట్టెలను ఏర్పాటు చేశారు. రెండువేల మంది విద్యార్థులతో గల్లాపెట్టెలను పంపిణీ చేసి, అమ్మవారి విరాళాలు సేకరించారు. విద్యార్థులు జమా చేసిన డబ్బులను చదువుల తల్లి ఆలయనిర్మాణానికి నేటికి ఖర్చు చేస్తున్నారు. మొదట్లో యాభైవేల రూపాయల విరాళం రావటంతో జ్ఞానసరస్వతీ అమ్మవారి మూలవిరాట్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. కళాశాలల విద్యార్థులచే ధ్వజస్తంభం ప్రతిష్ట చేవారు. పదోతరగతి విద్యార్థుల విరాళాలచే అమ్మవారికి అందమైన ఆభరణాలు చేయించారు. దీని లక్ష్యాన్ని ఛేదించాలని ధృఢనిశ్చయంతో ఆలయ నిర్మాణం పనులు ఇంకా అంచెలంచెలుగా కొనసాగిస్తున్నారు. కొంత మంది పెద్ద చదువులు చదివి, ఉద్యోగాలు సంపాదించిన విద్యార్థులు తమ మొదటినెల వేతనాన్ని అమ్మవారికి నేటికి విరాళంగా సమర్పిస్తున్నారు.
నందివనపర్తి జ్ఞాన సరస్వతి ఆలయానికి అనతి కాలంలోనే ఊహించని ఆదరణ నెలకొంది. 2018లో నిర్వహించిన సరస్వతీ మహాయజ్ఞం, 108 పాఠశాలలకు 108 ఏకశిల సరస్వతి విగ్రహాలను పంపిణీ చేయడంతో ఆలయ ప్రతిష్ట రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ఇప్పటికే పలుమార్లు ఆలయంలో హంపీ పిఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామీజీ ఎంతో మంది చిన్నారులకు సామూహిక అక్షరభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉచితంగా విద్యార్థులకు పలుకలు, పెన్నులు, నోటుపుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. చదువుల తల్లి సరస్వతీ దేవి పుట్టిన రోజు పర్వదినాన్ని పురస్కరించుకుని, ఆలయంలో వసంతి పంచమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో అమ్మవారికి నిత్య దీప, ధూప, నైవేధ్య కార్యక్రమాలతో పాటు ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు, అర్చనలు, సహస్ర కుంకుమార్చన కార్యక్రమాలను పురోహితులు రాఘవేంద్రశర్మ వైభవంగా నిర్వహిస్తారు. ఆలయంలో భక్తులకు కనీససౌకర్యాలను కల్పించటానికి అనేక ఏర్పాట్లను సేవాసమితి ఆధ్వర్యంలో చేశారు. అమ్మవారిని దర్శించుకోవటానికి మండల వాసులే కాకుండా ఇతర మండలాలు, జిల్లాల నుంచి వందలాది మంది భక్తులు తరిలివచ్చి, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. జ్ఞానసరస్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, బాసర వెళ్లినంతగా గర్విస్తుంటారు. ఇక్కడి పేద విద్యార్థులు జ్ఞానసరస్వతీ మందిరం తమకు వరంలాంటిదిగా భావిస్తారు. ఆలయంలో దేవీనవరాత్రి ఉత్సవాలను సైతం కన్నుల పండువగా నిర్వహించటంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని, తరించిపోతారు. దీని కోసం జ్ఞానసరస్వతీ ఫౌండేషన్ నిర్వాహణ మండలి, సలహా మండలి, మాతృమండలి, సేవామండలి, బాలసేవక మండలిలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. అమ్మవారి ఆలయం నిర్మాణం కోసం విద్యార్థులు, దాతలు ముందుకు వచ్చి, విరాళాలు సమర్పించి, అమ్మవారి ఆలయాభివృద్ధిలో తమ వంతు భాగస్వాములవుతున్నారు. కొంతమంది ఉద్యోగం రాగానే తమ మెదటినెల జీతాన్ని ఆలయ అభివృద్ధికి అందజేస్తారు.
ఆలయంలో జనవరి 30నుంచి ఫిబ్రవరి 7వ తేది వరకు ఆలయంలో శ్రీ శ్యామలా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి, దీంతో పాటు వసంత పంచమి వేడుకలు కొనసాగనున్నాయి. నిత్యం ఉధయం 7గంటల నుంచి 9గంటల వరకు, సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 8గంటల వరకు విద్యార్థులకు అమ్మవారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు మూడు అంశాలలో స్పర్థల కోసం సంకల్ప భవన్లో ఏర్పాటు. వసంత పంచమి రోజు 3వ తేదిన ఉదయం తెల్లవారుజామున మహా గణపతి పూజ, పుణ్యాహావాచనం, పంచగవ్య ప్రాశనం, అఖండ దీపారాధన, విద్యార్థులచే 108 కలశాలతో అమ్మవారికి అభిశేకం, సరస్వతీ హోమం, ఉధయం 9గంటల నుంచి చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం(హంపీపిఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామీజీ కరకమలములచే),స్వామీజీ అనుగ్రహ భాషణం, 10వ తరగతి విద్యర్థులకు ఆశీర్వచనం, పూర్ణాహుతి, మహాప్రసాద వితరణ, సాయంత్రం విద్యార్థులచే అమ్మవారి ఉత్సవ ఊరేగింపు, స్వామీజీ పర్యవేక్షణలో కొనసాగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వసంతపంచమి మహోత్సవాన్ని విజయవంతం చేయాలని జ్ఞానసరస్వతీ సేవా ట్రస్టు సభ్యులు కోరారు.