బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి (Vasantha Panchami) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చదువుల తల్లిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. అక్షరాభ్యాసం కోసం తీసుకొచ్చిన చిన్నారులతో ఆలయం ప్రాంగణంలో సందడి నెలకొన్నది. తెల్లవారుజామున 3 గంటల నుంచే అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు. కాగా, ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి కోసం ఎప్పటిలానే తిప్పలు తప్పడం లేదు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది.
ఇక సిద్దిపేట జిల్లాలోని వర్గల్లో కూడా వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. విద్యా సరస్వతి అమ్మవారికి వేకువజామునే వేదపండితులు విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. అక్షరాభ్యాసాల కోసం చిన్నారులతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్షరాభ్యాసాల కోసం అధికారులు ఆలయంలో ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేశారు.